ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇసుక బజార్‌లు ఏర్పాటు
శాలిగౌరారం: ప్రజలకు నాణ్యమైన ఇసుకను సరసమైన ధరలకు అందించేందుకు మైనింగ్‌శాఖ ఆధ్వర్యంలో ఇసుక బజార్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(టీజీఎంబీసీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్‌కుమార్ అన్నారు. శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామ సమీపంలో మూసీ నది ఒడ్డున ఉన్న ప్రభుత్వ ఇసుక రీచ్‌ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మూసీ నది నుంచి ఇసుక రవాణా, ఇసుక స్టాక్ పాయింట్, వేబ్రిడ్జిలను పరిశీలించారు. మూసీ ప్రాజెక్టులోని ఇసుకను నిర్ణీత సమయంలో వెలికితీసి స్టాక్ పాయింట్‌కు తరలించాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు, ఇసుక బజార్‌లకు ఇసుక రవాణా చేసే వాహనాలు ఇసుక స్టాక్‌పాయింట్ వద్ద వేచిచూడకుండా త్వరితగతిన లోడింగ్ జరిగేలా యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత రీచ్ నిర్వాహకులకు సూచించారు. ఇసుక వాహనాలను తూకం వేసే వేబ్రిడ్జిని పరిశీలించారు. వేబ్రిడ్జిలో ఏర్పడిన రిపేర్లను తక్షణమే సరిచేసి ఇబ్బందులు తలెత్తకుండా చడాలని సిబ్బందికి సూచించారు. తూకం కోసం ఇసుక వాహనాలు వేచిచూడకుండా అదనంగా మరో వేబ్రిడ్జిని ఏర్పాటు చేయాలని సంబంధిత ఉన్నతాధికారులకు సూచించారు. ఇసుక వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన ఇసుకను అందించేందుకు ప్రభుత్వం హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్, బౌరంపేట్, వట్టినాగులపల్లిలో ఇసుక స్టాక్‌పాయింట్‌లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుందన్నారు. ఆయా ఇసుక బజార్‌లను ఈ నెల 15న ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఇసుక రీచ్‌ల నుంచి ఇసుక బజార్‌లకు ఇసుకను తరలించి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇసుకను విక్రయించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట మైనింగ్‌శాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ జాకోబ్, అసిస్టెంట్ జియాలజిస్ట్ బాలు, సూపర్‌వైజర్ మహిపాల్ తదితరులు ఉన్నారు.
రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీ
సుశీల్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment