ప్రాజెక్టులకు రూ.1600 కోట్లు కేటాయింపు
ఫ గతేడాది కంటే ఈ బడ్జెట్‌లో నిధులు ఎక్కువే..
ఫ కొనసాగనున్న ఎస్‌ఎల్‌బీసీ, ముందుకు సాగనున్న డిండి
ఫ ప్రధాన, డిస్ట్రిబ్యూటరీ కాలువల ఆధునీకరణకు నిధులు
ఫ నాగార్జునసాగర్ డ్యాం పెండింగ్ పనులకు మోక్షం
ఫ ఎంజీ యూనివర్సిటీ అభివృద్ధికి పైసా కేటాయించని ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో గతేడాది కంటే కాస్త ఎక్కువ నిధులే కేటాయించింది. ప్రధాన ప్రాజెక్టులపై దృష్టి సారించింది. ముఖ్యంగా డిండి ఎత్తిపోతల పథకానికి, శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్‌ఎల్‌బీసీ) వంటి ప్రాజెక్టులకు నిధులు పెంచింది. నాగార్జునసాగర్ కింద పలు పెండింగ్ పనులు, ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల పనులకు మోక్షం లభించే అవకాశం ఉంది. మొత్తంగా నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టులకు ప్రగతి పద్దు కింద రూ.1600 కోట్లు (1599.90) కేటాయించింది. సూర్యాపేట జిల్లాలోని ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజ్–2, మూసీ ప్రాజెక్టు కింద పలు పనులకు గతేడాదిలాగే నిధులను ఇచ్చిన ప్రభుత్వం, యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు ప్రాజెక్టులకు ప్రత్యేకంగా బడ్జెట్‌లో కేటాయింపులను చూపించలేదు. బస్వాపూర్, గంధమల్లకు కాళేశ్వరం ప్రాజెక్టు కింద నిధులు వచ్చే అవకాశం ఉంది. బూనాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలకు ఇటీవల అనుమతి ఇచ్చిన రూ.266.65 కోట్లను వినియోగిస్తామని బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రకటించారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులపై ఆశలు
జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపును పెంచడంతో రైతుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఇన్‌లెట్‌లో ఇటీవల ప్రమాదం చోటు చేసుకోవడం.. ఇప్పటికీ సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే, ఈ బడ్జెట్‌లో ఎస్‌ఎల్‌బీసీ, ఏఎంఆర్‌పీ కింద నిధుల కేటాయింపు పెంపుతో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు కొనసాగుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ ప్రాజెక్టుకు గతే ఏడాది రూ.800 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి రూ.900 కోట్లను (899.90) కేటాయించింది. ఇందులో ప్రధాన కాలువల కోసం రూ. 578.81 కోట్లు కేటాయించగా, కాలువలు, డిస్ట్రిబ్యూటరీలకు రూ.201.19 కోట్లు, పునరావాసం, పరిహారం (ఆర్ అండ్ ఆర్) కోసం రూ.120 కోట్లు కేటాయించింది. నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని కరువు ప్రభావిత ప్రాంతాలకు నీటిని అందించేందుకు బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టును ప్రారంభించినట్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌లో ప్రసంగంలో పేర్కొన్నారు. దానిద్వారా 94 గ్రామాల్లో లక్ష ఎకరాలకు, 107 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు నీటిని అందిస్తామని చెప్పారు. అయితే ఈ ప్రాజెక్టు ఏఎఆర్‌పీలో భాగం అయినందున దీనికింద చేయాల్సిన కాలువల పనులకు కూడా ఈ నిధులనే వినియోగించే అవకాశం ఉంది.
జీతాలకే రూ.35 కోట్లు
మహాత్మాగాంధీ యూనివర్సిటీకి గతేడాదిలో వేతనాల కోసమే ప్రభుత్వం రూ.35 కోట్లు కేటాయించింది. ప్రగతి పద్దు కింద ఎలాంటి నిధులివ్వకపోవడంతో యూనివర్శిటీలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులు ముందుకు సాగే పరిస్థితి లేదు. వివిధ పనులను చేపట్టేందుకు, కొత్త కోర్సులన ప్రవేశపెట్టేందుకు, ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు, భవనాల నిర్మాణం, మౌలికసదుపాల కల్పన తదితర పనులకు రూ.309 కోట్లు కావాలని యూనివర్సిటీ ప్రతిపాదించినా పైసా ఇవ్వలేదు. ఇక నాగార్జునసాగర్‌లో బుద్ధుని వారసత్వ ప్రాంతీయ మ్యూజియం ఏర్పాటు కోసం రూ.1.15 కోట్లు కేటాయించింది. అలాగే బుద్ధవనం ప్రాజెక్టుకు రూ.3 కోట్లు కేటాయించింది.
నాగార్జునసాగర్‌కు పెరిగిన నిధులు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో వివిధ పనుల కోసం గతేడాది కంటే ఈసారి బడ్జెట్‌ను భారీగా పెంచింది. గతేడాది బడ్జెట్‌లో రూ.96.07 కోట్లు మాత్రమే కేటాయించిన ప్రభుత్వం ఈసారి వాటిని రూ.297.95 కోట్లకు పెంచింది. ఆ నిధులతో డ్యాం సంబంధిత, ప్రధాన పనులు, కాలువలు, డిస్ట్రిబ్యూటరీల పనులను చేపడతామని ప్రకటించింది. అయితే నాగార్జునసాగర్ కింద గతంలో మంజూరు చేసిన దాదాపు 15 ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పనులను ఈ బడ్జెట్‌లో ప్రస్తావించలేదు.