మూల్యాంకనంలో నిబంధనలకు పాతర!
నల్లగొండ : ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనంలో బోర్డు నిబంధనలకు అధికారులు పాతర వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సీనియర్లను కాదని జూనియర్లకే అన్ని బాధ్యతలు అప్పగిస్తున్నారని తెలిసింది. పేపర్ వాల్యుయేషన్‌లో జూనియర్ కళాశాలల అధ్యాపకులకే బాధ్యతలు అప్పగిస్తూ గురుకుల, మోడల్ అధ్యాపకులు సీనియర్లు ఉన్నా.. వారికి అవకాశం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక స్పాట్ వాల్యుయేషన్ సెంటర్‌లో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదని.. తాగు నీటిని కూడా ఇంటి నుంచే తెచ్చుకుంటున్నామని పలువురు అధ్యాపకులు చెబుతున్నారు.
సీనియర్లను కాదని జూనియర్లకు బాధ్యతలు
నల్లగొండలోని కోమడిరెడ్డి ప్రతీక్‌రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మొదటి వాల్యువేషన్ పూర్తికాగా.. ఆదివారం నుంచి రెండో విడతను ప్రారంభించారు. అయితే అసిస్టెంట్ ఎగ్జామినర్లు పేపర్ వాల్యుయేషన్ చేస్తారు. వారిపై చీప్ ఎగ్జామినర్లు, సబ్జెక్టు ఎక్స్‌పర్ట్‌లతోపాటు అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్ల బాధ్యతలు ఉంటాయి. అయితే బోర్డు నిబంధనల ప్రకారం అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్ (ఏసీఓ) బాధ్యతలు జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఇవ్వాలి. కానీ ఇక్కడ జూనియర్ లెక్చరర్లకు అప్పగించారు. ఆయా విషయంలో అనుభవం ఉన్నవారినే సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌లుగా నియమించాలి.. కానీ 25 ఏళ్ల సీనియర్లను కాదని.. జూనియర్ లెక్చరర్లకే ఆ బాధ్యతలు అప్పగించారన్న ఆరోపణలు ఉన్నాయి. చీఫ్ ఎగ్జామినర్ల నియామకంలోనూ అదే తీరుగా వ్యవహరించారని అధ్యాపకులు పేర్కొంటున్నారు.
కొరవడిన మౌలిక సదుపాయాలు..
నల్లగొండలోని మూల్యాంకనం కేంద్రంలో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. తాగునీరు లేకపోగా కనీసం రూమ్‌లు శుభ్రంగా ఉంచడం లేదని, టాయ్‌లెట్లు కూడా సక్రమంగా లేవని అధ్యాపకులు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.
ఫ జూనియర్లకు అందలం..
సీనియర్లకు మొండి చేయి
ఫ ప్రిన్సిపాళ్లకు ఇవ్వాల్సిన ఏసీఓ
పోస్టులు జూనియర్లకు అప్పగింత
ఫ సబ్జెక్టు ఎక్స్‌పర్ట్ బాధ్యతలు
కూడా జూనియర్లకే..
ఫ కేంద్రంలో కనీసం తాగునీరు
కూడా ఏర్పాటు చేయలేదని
అధ్యాపకుల ఆవేదన
నిబంధనలు పాటిస్తున్నాం
మూల్యాకనంలో ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారమే విధులు కేటాయించాం. అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్ల నియామకాలకు సంబంధించి ప్రిన్సిపాళ్లు రాకపోవడంతోనే జూనియర్ లెక్చరర్లకు అవకాశం కల్పించాం. మూల్యాంకనంలో ప్రభుత్వ, ఇటీవల రెగ్యులర్ అయిన లెక్చరర్లకే అవకాశం మొదట ఇస్తున్నాం. ఆ తర్వాత మోడల్ స్కూల్, గురుకుల అధ్యాపకులకు ఇస్తాం. చీఫ్ ఎగ్జామినర్లు, సబ్జెక్టు ఎక్స్‌పర్ట్‌ల విషయంలో సీనియర్లు లేనప్పుడే జూనియర్లకు అవకాశం ఇస్తున్నాం. మూల్యాంకన కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. మూ ల్యాంకనానికి అవకాశం రాని కొందరు అధ్యాపకులే ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారు.
– దస్రూనాయక్, డీఐఈఓ
Comments
Please login to add a commentAdd a comment