
క్రికెట్‌లో ఉచిత శిక్షణ
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీ నుంచి ఔట్‌డోర్ స్టేడియంలో క్రికెట్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు అసోసియేషన్ సెక్రటరీ అమీనుద్దీన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 8 నుంచి 19 సంవత్సరాలలోపు బాల బాలికలకు శిక్షణ ఇస్తామని, ఇతర వివరాలకు 9885717996 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
కేవీలో అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ
నల్లగొండ : నల్లగొండలోని కేంద్రియ విద్యాలయంలో 2వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు ఈ నెల 2 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపాల్ జి.శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను కేంద్రియ విద్యాలయ కార్యాలయంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి 12 వరకు పొందాలని పేర్కొన్నారు. పూరించిన దరఖాస్తులను ఈ నెల 11లోగా విద్యాలయంలో అందజేయాలని తెలిపారు. టెన్త్, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు కేంద్రియ నిబంధనల ప్రకారం అర్హత ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు వెబ్‌సైట్ www.nalgonda.kvs.gov.inలో చూడవచ్చని పేర్కొన్నారు.
సమాజ సేవలో భాగస్వాములు కావాలి
రాజాపేట: విద్యార్థులు సమాజ సేవలో భాగస్వాములు కావాలని ఎన్‌ఎస్‌ఎస్ తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ కోఆర్డిరేటర్ ప్రొఫెసర్ డాక్టర్ నర్సింహగౌడ్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎన్‌స్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి అన్నారు. మంగళవారం రాజాపేట మండలంలోని రఘునాథపురం గ్రామంలో నిర్వహిస్తున్న ఎస్‌ఆర్ కళాశాల విద్యార్థుల ఎన్‌ఎస్‌ఎస్ శిక్షణ శిబిరంలో భాగంగా ఏడవ రోజు గ్రామంలో మొక్కలు నాటడం, ప్రయాణికుల షెల్టర్‌కు రంగులు వేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కమటం రమేష్, ప్రోగ్రాం ఆఫీసర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
హనుమంతుడికి ఆకుపూజ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యం సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఇక ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా కొనసాగాయి. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించి, సాయంత్రం వెండి జోడు సేవ పూజలు నిర్వహించారు.