
అర్హులైన యువత దరఖాస్తు చేసుకోవాలి
కనగల్: అర్హులైన నిరుద్యోగ యువత రాజీవ్ యువ వికాసం పథకానికి ఈనెల 14 వరకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. షెడ్యూల్ కులాల కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కనగల్ మండలం జి.యడవల్లి గ్రామంలో రాజీవ్ యువ వికాసం పథకంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జి.యడవల్లి గ్రామం అత్యంత వెనుకబడిన గ్రామమని, గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకుగాను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశాల మేరకు తాను దత్తత తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. ఈ పథకం కింద రూ.50వేల నుంచి రూ.4లక్షల వరకు ఆర్థిక సాయం పొందేందుకు అవకాశం ఉందన్నారు. దరఖాస్తుతో పాటు, రేషన్ కార్డును జతచేయాలని, ఒకవేళ రేషన్ కార్డులు లేనట్లైతే ఆదాయం, కులం ధ్రువపత్రాలు సమర్పించాలన్నారు. మండల అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ జి.యడవల్లి చెరువు అలుగును పరిశీలించారు. అలుగు మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.మాన్యానాయక్, ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి విజయేందర్‌రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రాజ్‌కుమార్, బీసీ సంక్షేమ సహాయ అధికారి సంజీవయ్య, మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు అనూప్‌రెడ్డి, తహసీల్దార్ పద్మ ఎంపీడీఓ జయరాం తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి