తెలంగాణ లోకాయుక్తగా పెద్దవూర మండల వాసి | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ లోకాయుక్తగా పెద్దవూర మండల వాసి

Published Mon, Apr 7 2025 10:18 AM | Last Updated on Mon, Apr 7 2025 10:22 AM

పెద్దవూర: నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం శిర్సనగండ్ల గ్రామానికి చెందిన హైకోర్టు రిటైర్ట్‌ న్యాయమూర్తి జస్టిస్‌ యడవెల్లి రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ లోకాయుక్తగా నియమితులయ్యారు. శిర్సనగండ్ల గ్రామానికి చెందిన రైతు యడవెల్లి రామాంజిరెడ్డి–జయప్రద దంపతులకు ఐదుగురు సంతానం కాగా.. రాజశేఖర్‌రెడ్డి పెద్దవారు. ఆయన 1960 మే 4వ తేదీన జన్మించారు. రాజశేఖర్‌రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం మిర్యాలగూడలోని సెయింట్‌ మేరీ పాఠశాలలో, 6 నుంచి 10వ తరగతి వరకు నల్లగొండలోని సెయింట్‌ ఆల్పోన్సెస్‌ పాఠశాలలో, ఇంటర్మీడియట్‌ హైదరాబాద్‌లోని ఏవీఎం కళాశాలలో, బీఎస్సీ డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ వరంగల్‌లో సాగాయి. ఆ రోజుల్లోనే ఆయన విద్యాభ్యాసం అంతా ఇంగ్లిష్‌ మీడియంలో సాగింది. డిగ్రీ సైన్స్‌లో చేసినప్పటికీ బాబాయి కొండల్‌రెడ్డి అడ్వకేట్‌గా స్థిరపడటంతో ఆయనను ఆదర్శంగా తీసుకుని రాజశేఖర్‌రెడ్డి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో బంగారు పతకం సాధించారు. ఎల్‌ఎల్‌బీ పూర్తికాగానే 1985లో మొదట నల్ల గొండలో న్యాయవాదిగా ఒక సంవత్సరం పాటు ప్రాక్టీస్‌ చేశారు. అనంతరం హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే న్యాయవాదిగా 1985 ఏప్రిల్‌లో ఏపీ బార్‌ కౌన్సిల్‌లో ఎన్‌రోల్‌ చేసుకుని ప్రాక్టీస్‌ మొదలు పెట్టారు. తొలుత మహమూద్‌ అలీ వద్ద ప్రాక్టీస్‌ చేశారు. అనంతరం స్వతహాగా ప్రాక్టీస్‌ ప్రారంభించారు. 2004లో హైకోర్టు న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడిగా, అదే ఏడాది కేంద్ర ప్రభుత్వానికి సీనియర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, 2005లో అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌గా నియమితులయ్యారు. సెంట్రల్‌ ఎకై ్సజ్‌, సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియాకు న్యాయవాదిగా కూడా పనిచేశారు. 2013 ఏప్రిల్‌ 12వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 2014లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులై 2022 ఏప్రిల్‌లో పదవీ విరమణ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌తో కూడిన ఎంపిక కమిటీ సమావేశమై లోకాయుక్తగా యడవెల్లి రాజశేఖర్‌రెడ్డి పేరును ఖరారు చేసి రాజ్‌భవన్‌కు పంపింది. ఒకటి, రెండు రోజుల్లో నియామక ఉత్తర్వులు జారీ కానున్నాయి.

శిర్సనగండ్ల గ్రామానికి చెందిన యడవెల్లి రాజశేఖర్‌రెడ్డి పేరు ఖరారు

రాజ్‌భవన్‌కు చేరిన ప్రతిపాదనలు

ఒకటి రెండు రోజుల్లో జారీకానున్న ఉత్తర్వులు

స్వగ్రామంతో అనుబంధం కొనసాగిస్తూ..

శిర్సనగండ్ల గ్రామానికి పండుగలకు, శుభకార్యాలకు తరచూ రాజశేఖర్‌రెడ్డి వస్తుంటారని గ్రామస్తులు తెలిపారు. ఆయనకు సోదరులు యడవెల్లి దేవేందర్‌రెడ్డి, రఘుపతిరెడ్డి, దిలీప్‌రెడ్డి, సోదరి మంజుల ఉన్నారు. వీరిలో దేవేందర్‌రెడ్డి, రఘుపతిరెడ్డి శిర్సనగండ్ల గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా.. దిలీప్‌రెడ్డి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఆస్తి పంపకాల్లో రాజశేఖర్‌రెడ్డికి అనుముల మండలం కొసలమర్రి గ్రామంలో 12 ఎకరాల పొలం వచ్చింది. దీనిలో బత్తాయి తోట సాగుచేస్తూ తరచూ ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. స్వగ్రామంలో తనకంటూ కొంత భూమి ఉండాలన్న ఉద్దేశ్యంతో ఈ మధ్యనే శిర్సనగండ్లలో రాజశేఖర్‌రెడ్డి మూడెకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు ఆయన సోదరుడు దేవేందర్‌రెడ్డి తెలిపారు. రాజశేఖర్‌రెడ్డి చిన్నతనం నుంచి చదువులో మంచి ప్రతిభ కనపర్చేవారని కూడా పేర్కొన్నారు. తమ గ్రామానికి చెందిన వ్యక్తి లోకాయుక్తగా నియామకం కావడంతో శిర్సనగండ్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement