ఇరుముడి విప్పితే.. సమర్పించాల్సిందే!
శ్రీశైలంటెంపుల్: శివ దీక్ష భక్తులు దోపిడీకి గురవుతున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో 41 రోజుల పాటు శివమాల స్వీకరించిన భక్తులు దీక్ష విరమణకు ఇరుముడితో శ్రీశైలానికి తరలివస్తున్నారు. దీక్ష విరమణకు దేవస్థానం ప్రత్యేకంగా శివదీక్ష శిబిరాలను ఏర్పాటు చేసింది. స్థానిక ఆగమ పాఠశాలకు చెందిన సుమారు 106 మంది విద్యార్థులను మూడు విడుతలుగా విధులు కేటాయించారు. వీరికి ప్రత్యేక గుర్తింపుకార్డులను సైతం అందించారు. అయితే ఆగమ పాఠశాలలో గతంలో చదివిన వారు, ఆగమ పాఠశాలలో పనిచేసే వారికి పరిచయం ఉన్న కొందరికి సైతం గుర్తింపు కార్డులను ఇచ్చి ఇరుముడి విరమణ చేసేందుకు అనుమతించారు. వీరిలో కొందరు భక్తుల నుంచి దక్షిణ రూపంలో డిమాండ్ చేస్తున్నారు. దీక్ష విరమణ పూర్తయిన తరువాత భక్తులు తోచినంత ఇస్తే అర్చకులు స్వీకరించాలి. అలా కాకుండా కచ్చితంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇరుముడి విరమణ చేస్తే కచ్చితంగా రూ.100, అపై ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు. ‘ఏంటి స్వామి ఇలా డిమాండ్ చేస్తున్నారు’ అని భక్తులు ప్రశ్నిస్తే ‘మేము ఇచ్చుకునేవి ఉన్నాయని’ బదులిస్తున్నట్లు శివభక్తులు ఆరోపిస్తున్నారు. శివదీక్ష శిబిరాలను పర్యవేక్షించాల్సిన దేవస్థానం అధికారుల నిర్లక్ష్యంతో భక్తులు దోపిడీకి గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment