నీటి దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలం
● రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి
నంద్యాల(అర్బన్): విద్యుత్ ఉత్పత్తి పేరుతో శ్రీశైలం జలాశయం నీటిని యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నా అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి విమర్శించారు. కృష్ణారెడ్డి యజామాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం రాయలసీమ సాగునీటి సామితి ఆధ్వర్యంలో పట్టణంలో రైతులతో భారీ ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎం, ముస్లింలీగ్, ఏఐకేఎస్, రైతు, వాణిజ్య, వర్తక, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టుకు 1562 టీఎంసీలకు వచ్చి చేరితే సాగర్‌కు హక్కుగా ఉన్న 264 టీఎంసీలు దిగువకు వదిలి మిగిలినవి శ్రీశైలంలో నిల్వ ఉంచాల్సి ఉందన్నారు. అయితే 1200 టీఎంసీల నీటిని సాగర్‌కు వదిలి శ్రీశైలాన్ని ఎండగట్టడం దారుణమన్నారు. చట్టాలను గౌరవించాల్సిన ప్రభుత్వం వాటి ఉల్లంఘనలకు పాల్పడటాన్ని ప్రజలు హర్షించబోరన్నారు. కర్నూలులోనే కేఆర్‌ఎంబీని ఏర్పాటు చేయాలని, రాయలసీమ ప్రజల ఆకాంక్షకు విరుద్ధంగా పాలకులు చర్యలు తీసుకుంటే సీమ వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేరిట రాసిన లేఖను నంద్యాల తహసీల్దార్ ప్రియదర్శినికి అందజేశారు. కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షుడు వైఎన్‌రెడ్డి, సీపీఐ, సీపీఎం నాయకులు రంగనాయకులు, రాజశేఖర్, బాలీశ్వరరెడ్డి, బెక్కెం రామసుబ్బారెడ్డి, కొండారెడ్డి, సలాం, వైఎస్సార్‌సీపీ నాయకులు సోమ శేఖర్‌రెడ్డి, సయ్యద్ మహబూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment