● డోనేషన్ పేరుతో ఓ ప్రైవేట్ సంస్థ యాడ్ ప్రచురణ ● శ్రీశైల దేవస్థానం నిర్లక్ష్య వైఖరిపై మండిపడుతున్న భక్తులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన మల్లన్న దర్శనానికి అనునిత్యం సామాన్యులే కాక వీఐపీలు, వీవీఐపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం తరలివస్తారు. అటువంటి మహాపుణ్యక్షేత్రంలో ఎటువంటి ప్రైవేట్ సంస్థల ప్రచారాలు నిర్వహించకూడదు. శ్రీశైల దేవస్థానానికి పలువురు దాతలు అన్నదానం, గోశాల నిర్వహణ, కాటేజీలు, వసతిగదుల నిర్మాణానికి విరాళాలు అందిస్తారు. స్వామి అమ్మవార్లకు బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు బహూకరిస్తారు. కానీ ఎవరు వారి వారి సంస్థలకు చెందిన ఎటువంటి ప్రచారాలు చేసుకోరు. కాగా ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు విచ్చేసే ఆయా శాఖలకు చెందిన పలువురు అధికారులు, సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు, స్వచ్ఛంద సేవకులకు క్యూర్ కోడ్‌తో కూడిన డిజిటల్ గుర్తింపుకార్డులను దేవస్థానం మంజూరు చేశారు. ఈ డిజిటల్ కార్డులను ఓ ప్రైవేట్ సంస్థ స్పాన్సర్ చేసింది. అంతా బాగున్నా ..ఆ డిజిటల్ ఐడెంటీకార్డుల వెనుక ఆ ప్రైవేట్ సంస్థ ప్రచారాన్ని సైతం నిర్వహించుకుంది. ఇదే ఇప్పుడు క్షేత్రంలో పెద్ద చర్చ సాగుతుంది. దేవస్థానంలో ప్రైవేట్ సంస్థ ప్రచారం చేసుకోవడం ఏంటని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ సంస్థ ప్రచారం చేసుకునేందుకు అనుమతి ఎవరు ఇచ్చారని భక్తులు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment