పాగాలంకరణ పూర్వజన్మ సుకృతం
● ఫృధ్వీ సుబ్బారావుతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ
శ్రీశైలం టెంపుల్: మహాశివరాత్రి బ్ర హ్మో త్సవాల్లో శ్రీశైల మల్లన్నకు లింగోద్భవ కాలాన నిర్వహించే పాగాలంకరణకు ఎంతో విశిష్టత ఉంది. బ్రహ్మోత్సవ కల్యాణానికి ముందు మల్లికార్జున స్వామికి పాగాలంకరణ చేయడం సంప్రదాయం. ఈ సేవను ఒకే కుటుంబం వారసత్వంగా నిర్వహిస్తోంది. ఏటా మహాశివరాత్రి నాడు మల్లన్నకు తలపాగా చుడుతున్న దేవాంగ భక్తుడు ఫృధ్వి వెంకటేశ్వర్లు కుమారుడు సుబ్బారావు సతీసమేతంగా పాగాతో స్వామి సన్నిధికి చేరుకున్నారు. ఈ సందర్బంగా ‘సాక్షి’ ఆ యనను పలకరించింది. పాగాలంకరణ విశేషాలు ఆయన మాటల్లో..
ప్రశ్న. పాగాలంకరణ ఎలా మొదలైంది? ఎప్పటి నుంచి చేస్తున్నారు?
ఫృధ్వి: మా పెద్దలు ఇంటి దైవంగా కొలిచే మల్లన్న బ్రహ్మోత్సవాల్లో మహాశివరాత్రి నాడు స్వయంగా నేసిన పాగాను అలంకరించేవారు. నాలుగు తరాల నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. మొదట మా ముని తాతయ్య కందస్వామి, ఆ తరువాత మా తాత సుబ్బారావు, అటు తరువాత మా నాన్న ఫృధ్వీ వెంకటేశ్వర్లు పాగాలంకరణ చేశారు. ఆయన తరువాత నేను స్వామివారికి పాగాలంకరణ చేస్తున్నా. నా చిన్నప్పటి నుంచి పాగా తయారు చేస్తున్నా. మా పూర్వీకుల నుంచి సుమారు 70ఏళ్లకు పైగా ఈ ఆచారం కొనసాగుతోంది.
ప్రశ్న. పాగా నేసే విధానం ఎలా?
ఫృధ్వి: స్వామివారికి పాగా ఎంతో భక్తి శ్రద్ధలతో నేస్తాం. ఇది ఒక దీక్ష. గతంలో ప్రతిరోజు ఒకమూర చొప్పున ఏడాది పాటు 365రోజులు 365మూరలు నేస్తాం. అయితే ప్రస్తుతం కార్తీకమాసం ప్రారంభం నుంచి పాగా నేతను ప్రారంభించి శివరాత్రికి 10రోజుల ముందే మూర వెడల్పుతో 300 మూరలు పూర్తి చేస్తాం. మహాశివరాత్రి పండుగ రోజున కుటుంబ సమేతంగా వచ్చి సంప్రదాయబద్ధంగా పాగాలంకరణ చేస్తాం.
ప్రశ్న: మీ కుటుంబ నేపథ్యం?
ఫృధ్వి: మాది ప్రకాశం జిల్లా చీరాల వద్ద హస్తినాపురం. మా అమ్మానాన్న ఫృధ్వి వెంకటేశ్వర్లు, గౌరీకుమారి. నేను, మా చెల్లెలు మల్లీశ్వరి. ఇద్దరికి పెళ్లిళ్లు అయ్యాయి. అందరం ఒకే ఇంట్లో ఉమ్మడిగా ఉంటున్నాం.
ప్రశ్న: పాగాలంకరణకు దేవస్థానం అందిస్తున్న సహకారం ఏంటి?
ఫృధ్వి: ఏటా మహాశివరాత్రి నాడు మల్లన్నకు తలపాగా చుట్టాలని ప్రత్యేక ఆహ్వన పత్రాన్ని దేవస్థాన అధికారులు అందజేస్తారు. పాగా వస్త్రంతో వచ్చినప్పుడు ఆలయ మర్యాదలతో స్వాగతం పలుకుతారు. భోజనం, వసతి, ప్రత్యేక దర్శనాలతో పాటు ఆర్థిక పోత్రాహన్ని కూడా అందజేస్తున్నారు.
ప్రశ్న: మల్లన్నకు పాగా చుట్టే అవకాశం రావడం ఎలా ఉంది?
ఫృధ్వి: మా పూర్వీకుల నుంచి ఈ ఆచారం వస్తుంది. కొట్లాది మంది భక్తులు ఇష్టదైవంగా కొలిచే మల్లికార్జున స్వామికి పాగాలంకరణ చేయడం మేము చేసుకున్న అదృష్టం. మల్లయ్యే మాకు ఈ అదృష్టాన్ని కల్పించారు.
పాగాలంకరణ పూర్వజన్మ సుకృతం
Comments
Please login to add a commentAdd a comment