రైతులను వేరు చేస్తూ.. అంకెలతో మాయ చేస్తూ !
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగంలో అమలు చేసే సంక్షేమ పథకాలు అందాలన్నా.. పంట రుణాలు తీసుకోవాలన్నా.. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పరిహారం పొందాలన్నా.. ఇక నుంచి రైతులకు భూ ఆధార్ నంబర్ తప్పనిసరి కానుంది. అయితే కేవలం వారసత్వంగా కొనసాగుతున్న పట్టా భూమిరైతులకు మాత్రమే ఇస్తూ డీ పట్టా, అటవీ భూములు, కౌలు రైతులను పరిగణలోకి తీసుకోకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. సంక్షేమ పథకాలు అందకపోతే తమ పరిస్థితి ఏమిటని అధికారులను ప్రశ్నిస్తున్నారు.
జూపాడుబంగ్లా: ప్రతి వ్యక్తికి ఆధార్ నెంబర్ ఉన్నట్లు గా ఇకపై ప్రతి రైతుకు గుర్తింపు నంబర్ ఉండాలనే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో రైతు సేవా కేంద్రాల్లో రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 1,90,291 మంది రైతులుండగా వారిలో ఇప్పటి దాకా 1,27,165 మంది రైతులకు 11 అంకెలతో కూడిన గుర్తింపు నంబర్లు కేటాయించినట్లు తెలుస్తోంది. యూనిక్ ఐడీ ఉన్న రైతులకు ఖరీఫ్, రబీ సీజన్లలో పొందే రాయితీ విత్తనాలు, ఎరువులు, పంటరుణాలు, పంటలబీమా, రాయితీ వ్యవసాయ పరికరాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. రైతు ఐడీ నంబర్‌ను యూనిఫైడ్ ల్యాండ్ ఏపీఐ, ఆధార్ అథంటికేషన్, పీఎం కిసాన్ వంటి పథకాలకు అనుసంధానం చేస్తారు. అలాగే ఐడీ నెంబర్ కలిగిన రైతులు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా బ్యాంకుల నుంచి పంట రుణాలు, పండించిన పంటలకు మద్దతు ధర పొందవచ్చు. అయితే డీ పట్టా భూములు పొంది వ్యవసాయం చేసుకుంటున్న రైతులు యూనిక్ ఐడీ నంబర్‌కు దూరమవుతున్నారు. డీ పట్టా, కౌలు రైతులు, అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్‌లో అవకాశం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. సొంతంగా పట్టా భూములు కలిగిన వారు మాత్రమే రైతులవుతారా..తాము రైతులం కాదా అని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో గిరిజనులు వ్యవసాయంలో రాణించేలా గత ప్రభుత్వాలు భూముల పంపిణీ చేపట్టింది. ఈ మేరకు ఆత్మకూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల గిరిజన రైతులు అధిక సంఖ్యలో ఉన్నారు. వీరికి కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ అవకాశం లేకపోవడంతో ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకొని గుర్తింపు నంబర్ పొందిన రైతులకు మాత్రమే సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో తమ పరిస్థితి ఏమిటని డీ పట్టా, అటవీ భూములు సాగు చేసుకునే రైతులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా రైతుల రిజిస్ట్రేషన్ ఇలా..
నియోజకవర్గం మొత్తం రైతులు ఐడీ పొందిన రైతులు
నందికొట్కూరు 36,326 25,553
శ్రీశైలం 25,034 15,473
డోన్ 33,479 20,804
బనగానపల్లె 40,110 28,964
నంద్యాల 12,820 7,800
ఆళ్లగడ్డ 42,451 28,571
మొత్తం 1,90,220 1,27,165
రైతులకు యూనిక్ ఐడీ నంబర్ జారీ
సొంత భూమి ఉన్న రైతులకే
కేటాయింపు
డీ పట్టా, అటవీ భూములు,
కౌలు రైతులకు ఇవ్వని వైనం
సంక్షేమ పథకాలు అందవని ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment