బ్రహ్మోత్సవ యాగ క్రతువులకు పూర్ణాహుతి
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నవాహ్నిక దీక్షతో ఫిబ్రవరి 19వ తేదీ నుంచి నిర్వహించిన శ్రీశైల మల్లన్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవ యాగాలకు శుక్రవారం పూర్ణాహుతి నిర్వహించారు. యాగశాలలో వేదపండితులు ఉత్సవ ముగింపు క్రతువులకు శాస్త్రోక్తంగా జరిపారు. నారికేళాలు, పలు సుగంధ ద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలు వంటి పూజాద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించారు. చండీశ్వరుడికి సరస్వి పుష్కరిణి వద్ద ఆగమశాస్త్రబద్ధంగా స్నానాదికాలు జరిపారు. చివరిగా త్రిశూల స్నానం నిర్వహించారు. సాయంత్రం ఉత్సవాల ముగింపు సూచికంగా ధ్వజ పతాకావరోహణ చేశారు. స్వామి వారి నిత్యకల్యాణ మండపంలో సదస్యం–నాగవల్లి కార్యక్రమాలు నిర్వహించారు. నాగవల్లి కార్యక్రమంలో మహాశివరాత్రి రోజున కల్యాణోత్సవం జరిపించిన భ్రమరాంబాదేవికి ఆగమశాస్త్రం సంప్రదాయం మేరకు మెట్టెలు, నల్లపూసలు సమర్పించారు. కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, ప్రధానార్చకులు వీరయ్యస్వామి, అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు మార్కండేయశాస్త్రి, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. చివరి రోజు శనివారం సాయంత్రం భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారికి అశ్వవాహనసేవ, ఊరేగింపు, అనంతరం ఉత్సవమూర్తులకు పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవ యాగ క్రతువులకు పూర్ణాహుతి
Comments
Please login to add a commentAdd a comment