ఇంటర్ పరీక్షలు ప్రారంభం
● మొదటి రోజు 595 మంది
విద్యార్థుల గైర్హాజరు
నంద్యాల(న్యూటౌన్): ఇంటర్మీడియెట్ పరీక్షలు శనివారం ప్రారంభం అయ్యాయి. తొలిరోజు మొదటి సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్(తెలుగు) పేపర్–1, సంస్కృతం పరీక్షలకు నంద్యాల జిల్లాలో 595 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీవీఈఓ సునీత తెలిపారు. జిల్లాలోని 53 పరీక్షా కేంద్రాల్లో 16,174 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 15,579 మంది హాజరయ్యారన్నారు. డీవీఈఓతో పాటు మూడు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, రెండు టీంలు సిట్టింగ్ స్క్వాడ్‌లు.. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చూశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు.మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే చర్యలు తీసుకుంటామని డీవీఈఓ హెచ్చరించారు.
ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య
పంజగుట్ట: ఉద్యోగం రావడంలేదని మనస్థాపంతో బీటెక్ పూర్తిచేసిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా శ్రీశైలానికి చెందిన నూకరాజు (29) బీటెక్ పూర్తిచేశాడు. నగరంలోని అమీర్‌పేటలో ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేశాడు. ఇటీవల ఓ సంస్థలో ఇంటర్వ్యూకు వెళ్లిన నూకరాజు తప్పకుండా ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో తోటి రూమ్‌మేట్‌కు పార్టీ కూడా ఇచ్చాడు. అయితే ఆ ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. శుక్రవారం నూకరాజు రూమ్‌మేట్ మణికంఠ ఉదయం 8 గంటలకు తాను ఆఫీస్‌కు వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయాడు. మణికంఠ రాత్రి 7.30 ప్రాంతంలో వచ్చి చూడగా గది లోపలనుంచి గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూశాడు. ఫ్యాన్‌కు వేలాడుతున్నట్లు కనిపించడంతో వెంటనే సిబ్బందికి చెప్పి తలుపులు తెరిచి చూడగా నూకరాజు అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు.
నేడు ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష
కర్నూలు(అర్బన్): గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి ప్రవేశాలకు ఎంట్రెన్స్ టెస్ట్ ఈ నెల 2న నిర్వహిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి కె.తులసీదేవి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. పరీక్షకు జిల్లాకు చెందిన 41 మంది బాల బాలికలు దరఖాస్తు చేసుకున్నారని, వీరందరికి స్థానిక బి.క్యాంప్‌లోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల రెసిడెన్షియల్ స్కూల్‌లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment