ప్రకృతి వ్యవసాయంలో రాణించాలి
నంద్యాల: జిల్లాలోని రైతులందరూ ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేసి అందులో రాణించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో రైతు సాధికారిక సంస్థ – ప్రజాభాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై రైతు సంఘాల సభ్యులు, రైతులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులతో సారవంతమైన భూమి నిస్తారమై పోవడమే కాకుండా మనిషి ఆరోగ్యం కూడా దెబ్బతినే సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. ఆహారపు అలవాట్లు సరిగ్గా పాటించకపోతే భవిష్యత్‌లో భావితరాల వారు తీవ్ర అనారోగ్య ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రకృతి వ్యవసాయంలో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ తక్కువ పెట్టుబడితో నాణ్యమైన పంటలు పండించుకునే అవకాశం ఉంటుందన్నారు. రైతులందరూ ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించే స్థాయికి రావాలని సూచించారు. రానున్న రోజుల్లో నాణ్యమైన ఉత్పత్తులతో పాటు బ్రాండింగ్ ఇవ్వగలిగే స్థాయికి జిల్లా రైతులు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని 1633 అంగన్‌వాడీ కేంద్రాలు, 86 సంక్షేమ వసతి గృహాల ఆవరణలో కిచెన్ గార్డులు ఏర్పాటు చేసి ఆకుకూరలు పెంచి ఆహార పదార్థాల్లో వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతకు ముందు ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్న రైతులు బాల మద్దిలేటి, పగడం వెంకటేశ్వర్లు, మార్తమ్మ మాట్లా డుతూ ప్రకతి వ్యవసాయంలో దేశవాళి వరి విత్తనా ల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయన్నారు. పిల్లాయి సాంబ, పొంగారు పొంగారు రైస్, మైసూర్ మల్లిక చిట్టి, చిట్టి ముత్యాలు, కాలనమ్మ, శివుని సాంబ తదితర పదిరకాల దేశవాళి విత్తనాల గురించి రైతులకు వివరించారు. అంతకుముందు ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను కలెక్టర్ పరిశీలించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, ఉద్యానవన శాఖ అధికారి నాగరాజు, జిల్లా పట్టు పరిశ్రమల అధికారి పరమేశ్వరి, కేవీకే శాస్త్రవేత్త బాలరాజు, డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి, వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ రాజకుమారి
Comments
Please login to add a commentAdd a comment