ప్రతికూల పరిస్థితులతో పోరాడి...
ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా జిల్లా ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ పోతుల శ్రీదేవి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘ మాది మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లా పార్వతీపురం. నాన్న పోతుల నరసయ్య పోలీసు శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. అమ్మ పోతుల శాంతమ్మ. 1998లో నాకు 16 ఏళ్ల వయస్సులో నాన్న మరణించారు. నేను పెద్ద కుమార్తెను. నాకు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. నాన్న నాకు ఎప్పుడూ స్ఫూర్తినిచ్చేవారు. భయాన్ని ఎదుర్కొని.. వైఫల్యాన్ని విజయానికి మెట్టుగా మల్చుకోవాలని సూచించారు. నాన్న మరణం తర్వాత కారుణ్య నియామకం కింద ఉద్యోగం వచ్చినప్పటికీ అమ్మ ఆ ఉద్యోగాన్ని తిరస్కరించారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కోచింగ్ లేకుండానే నేను గ్రూప్–1లో ర్యాంకు సాధించాను. మొదట పార్వతీపురం జిల్లాలో ని జియ్యమ్మవలసలో విధులు నిర్వహించి ఉత్తమ ఎంపీడీఓ అవార్డు అందుకున్నా. విధులు నిర్వహిస్తూనే గ్రూప్–1లో ర్యాంకు సాధించి ఎకై ్సజ్ శాఖలో అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా ఎంపికయ్యాను. నా విజయానికి తండ్రి నరసయ్య, భర్త నరేంద్ర కుమార్ రాజు కారణం. మాకు ఇద్దరు పిల్లలు సంతానం. నువేశ్ నంద 8వ తరగతి, దిమాహి 4వ తరగతి చదువుతున్నారు. 2011లో మహబూబ్ నగర్‌లో విధులు నిర్వహించేటప్పుడు బెస్ట్ ఏఈఎస్ అవార్డు అందుకున్నాను.’’
– కర్నూలు
భర్త ప్రోత్సాహంతోనే డీఎఫ్‌ఓగా..
కర్నూలు జిల్లా అటవీ శాఖ అధికారి పి.శ్యామల జన్మస్థలం అనంతపురం జిల్లా కల్యాణదుర్గం. తల్లిదండ్రులు శకుంతల, తిమ్మరాయప్ప. వీరి మొదటి కుమార్తె అయిన శ్యామల ఎస్‌కే యూనివర్సిటీలో బాటనీలో పీజీ పూర్తి చేసి గోల్డ్‌మెడల్ సాధించారు. ఈమె 2004లో అటవీ శాఖలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్‌కు ఎంపికై అనంతపురంలోనే ఉద్యోగంలో చేరారు. 2006లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. 2023 మార్చి నుంచి కర్నూలు డీఎఫ్‌ఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘భర్త ప్రోత్సాహంతో నేను ఈ స్థాయికి వచ్చాను. కుటుంబంలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన ఉండకూడదు. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం చాలా అవసరం’ అని డీఎఫ్‌ఓ శ్యామల పేర్కొన్నారు. – కర్నూలు కల్చరల్
ప్రతికూల పరిస్థితులతో పోరాడి...
Comments
Please login to add a commentAdd a comment