
హనుమంత వాహనంపై అహోబిలేశుని వైభవం
ఆళ్లగడ్డ: అహోబిలేశుడు శనివారం ఎగువలో శేష, చంద్రప్రభ వాహనాల్లో, దిగువలో శ్రీ యోగానృసింహ గరుడ విమానం, హనుమంత వాహనాలపై ఉభయ దేవేరులతో కలసి మందస్మిత దరహాస వీచికలతో దర్శనమిచ్చారు. భక్తుల గోవింద నామస్మరణతో నల్లమల పులకించి పోయింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు శనివారం ఎగువ అహోబిలంలో శ్రీ జ్వాలా నరసింహస్వామి శేష వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ జ్వాలా నారసింహ స్వామిఅమ్మవార్లకు నిత్య పూజల్లో భాగంగా తెల్లవారు జామున మేలుకొలుపు వేద మంత్రోచ్ఛారణలతో అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం విశేష పుష్పాలంకరణ గావించిన శేష వాహనంపై ఉభయ దేవేరులతో కొలువైన జ్వాలా నరసింహుడు మంగళ వాయిద్యాలతో మాడ వీధుల్లో వివహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకం నిర్వహించారు. రాత్రి జ్వాలా నారసింహుడు చంద్రప్రభ వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు.
దిగువ అహోబిలంలో..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజైన శనివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వామి శ్రీ యోగానృసింహ గరుడ విమానంపై కొలువై విహరించారు. అంతకు ముందు ఉత్సవ మూర్తులు శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను యాగశాలలో కొలువుంచి జలాభిషేకం నిర్వహించారు. అనంతరం నూతన పట్టువస్త్రాలు, వజ్ర, వైడూర్యాలు పొదిగిన బంగారు అభరణాలతో ప్రత్యేకంగా ముస్తాబైన ప్రహ్లాదవరదుడు ఉభయ దేవేరులతో శ్రీ యోగనృసింహ గరుడ విమానం వాహనం అధిరోహించారు. మాడ వీధుల్లో స్వామి అమ్మవార్లు వైభవో పేతంగా ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. మధ్యాహ్నం పంచామృతాభిషేకం, జలాభిషేకం నిర్వహించి స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన అద్దాల మండపంలో కొలువుంచారు. రాత్రి శ్రీ ప్రహ్లాదరవదస్వామి హనుమంతు వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు.
అహోబిలంలో నేడు..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో ఆదివారం ఉదయం ఉత్సవం, మధ్యాహ్నం అభిషేకం, రాత్రి శరభ వాహన సేవ, దిగువ అహోబిలంలో ఉదయం శేషవాహన సేవ, మధ్యాహ్నం అభిషేకం, రాత్రి చంద్రప్రభ వాహన సేవ నిర్వహించనున్నారు.

హనుమంత వాహనంపై అహోబిలేశుని వైభవం

హనుమంత వాహనంపై అహోబిలేశుని వైభవం
Comments
Please login to add a commentAdd a comment