శేష శైలావాసా.. అహోబిలేశా!
● వైభవోపేతం అహోబిలేశుడి
బ్రహ్మోత్సవం
● శేషవాహనంపై దర్శనమిచ్చిన
ప్రహ్లాదవరదుడు
● శరభ ప్రభ వాహనంపై ఊరేగిన
జ్వాలా నరసింహుడు
ఆళ్లగడ్డ: ప్రహ్లాదవరదుడు చిన్ని కృష్ణుడయ్యాడు. ఆదిశేషునిని వాహనంగా చేసుకుని నవనీత కృష్ణావతారంలో మాడ వీధుల్లో ఉభయ దేవేరులతో కలసి విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. నెమలి పింఛం, ప్లిలనగ్రోవితో కృష్ణుడి రూపంలో భక్తులను మంత్రముగ్దులను చేశారు. అహోబిలంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు దిగువ అహోబిలంలో ఆదివారం ఉదయం ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదుడిని యాగశాలలో కొలువుంచి పట్టు వస్త్రాలతో అలంకరించి కొలువుంచారు. అనంతరం వివిధ స్వర్ణాభరణాలు ధరించిన ప్రహ్లాదవరదుడు విశేషంగా ముస్తాబైన ఉభయ దేవేరులతో తొమ్మిది తలల శేషవాహనం అధిష్టించి మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులను యాగశాలలో కొలువుంచి పంచామృతాలతో అభిషేకించి తిరుమంజనం నిర్వహించి అద్దాల మండపంలో కొలువుంచారు. రాత్రి శ్రీ ప్రహ్లాదరవదస్వామి చంద్రప్రభ వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు.
ఎగువ అహోబిలంలో..
ఉత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో కొలువైన జ్వాలా నరసింహస్వామి ఆదివారం శరభ వాహనాన్ని అధిష్టించి భక్తులను అనుగ్రహించారు. ఉదయం నిత్య పూజల అనంతరం ఉత్సవ మూర్తులైన జ్వాలా నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి ఉత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. రాత్రి స్వామి వారు శరభ వాహనంపై కొలువు కాగా గ్రామోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఎగువ అహోబిలంలో పొన్నుచెట్టువాహన సేవ, దిగువ అహోబిలంలో మోహిని అలంకారం, మధ్యాహ్నం అభిషేకం, రాత్రి శరభ వాహన సేవలు ఉంటాయి.
శేష శైలావాసా.. అహోబిలేశా!
శేష శైలావాసా.. అహోబిలేశా!
Comments
Please login to add a commentAdd a comment