కర్నూలు(అగ్రికల్చర్): బహుళార్థ పశువైద్యశాల.. కర్నూలు నగరంతో పాటు జిల్లాలోని మూగజీవుల పాలిట వరం. ఏరియా పశువైద్యశాలలు, వెటర్నరీ డిస్పెన్సరీల్లో చేతులెత్తేసిన కేసులకు ఇక్కడి వైద్యులు మెరుగైన వైద్యం అందించడంతో పాటు శస్త్ర చికిత్సలు చేస్తూ ప్రాణం పోస్తున్నారు. అత్యవసర వైద్యం కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూగజీవులను కొండారెడ్డిబురుజు సమీపంలోని బహుళార్ధ పశువైద్యశాల కు తీసుకొస్తారు. గత వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో వైద్య సేవల్లో ఎలాంటి లోపం లేకుండా అందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆసుపత్రి నిర్వహణ అటకెక్కింది. అధునాతన యంత్ర పరికరాలు మరుగునపడటంతో వైద్య సేవలు అధ్వాన్నమయ్యాయి. గతంలో యజమానులకు ఒక్క రూ పాయి ఖర్చు లేకుండా వైద్య సేవలు అందించారు. నేడు వైద్య సేవలు మినహాయిస్తే.. పరీక్షలు, మందు లు ఇతరత్రాలన్నీ బయటకే రాస్తుండటం గమనార్హం.
సేవలు నిర్వీర్యం
ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక బహుళార్ధ పశువైద్య శాల ఉంది. ఒక డీడీ పోస్టు, రెండు ఏడీ పోస్టులు, రెండు వెటర్నరీ అసిస్టెంటు సర్జన్ పోస్టులు ఉన్నాయి. సిబ్బంది పూర్తి స్థాయిలో ఉన్నారు. ప్రధానమైన సమస్య చికిత్సకు ఏది అవసరమైన బయటికి వెళ్లి తెచ్చుకోవాల్సిందే. సాంకేతిక సమస్యల కారణంతో సేవలను నిర్వీ ర్యం చేసినట్లు తెలుస్తోంది. డిజిటల్ ఎక్స్‌రే యూనిట్ ఉన్నా.. కొన్ని నెలలుగా పూర్తిగా మరుగున పడిపోయింది. ఎక్స్‌రే మిషన్ దుమ్మూ, ధూళితో నిండిపోయింది. రక్తం, యూరిన్ పరీక్షలను కూడా బయటికే పంపుతున్నారు. ఎక్స్‌రే కోసం గాంధీనగర్‌కు.. రక్త, యూరిన్ పరీక్షలకు గాయత్రీ ఎస్టేటుకు వెళ్లాల్సి వస్తోంది.
అరకొరగా మందులు
ప్రస్తుతం ఆసుపత్రిలో రెండు, మూడు మందులు ఇస్తే.. మరో రెండు, మూడు బయటికి రాస్తున్నారు. ఆసుపత్రిలో సేవలు గాడితప్పినా పశువైద్యశాల డీడీ, జిల్లా పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ పట్టించుకున్న దాఖలాలు లేవు. కాస్త చొరవ తీసుకుంటే అన్ని రకాల వైద్య సేవలు బయటకు పంపకుండానే అందించే అవకాశం ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం గమనార్హం. ఆసుపత్రికి ప్రతి రోజు కుక్కలు, పిల్లులు, పందులు ఇతర పశువులను 130 వరకు తెస్తుంటారు. ఇందులో 10 శాతం వాటికి ఎక్స్‌రే అవసరం అవుతుంది. మరో 10 శాతం వాటికి రక్త, పేడ పరీక్షలు నిర్వహిస్తారు. ఎక్స్‌రే తీయడానికి రూ.800–రూ.1000 వరకు ఖర్చు అవుతుంది. పరీక్షలకు మరో రూ.1000 వరకు వెచ్చించాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని చూస్తే ఆసుపత్రి అధికారులు రైతులపై ఏ స్థాయిలో ఆర్థిక భారం మోపుతున్నారో స్పష్టమవుతోంది. కుక్కలు, పిల్లులకు ఉచితంగా టీకాలు వేయాల్సి ఉన్నా.. వాటిని కూడా బయటకే రాస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
మరుగున పడిన ప్రతిపాదనలు
బహుళార్ధ పశువైద్యశాలను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్పు చేయాలనే ప్రతిపాదన ఉంది. ఇందులో భాగంగానే రూ.4 కోట్లతో అన్ని రకాల సదుపాయాలతో జి+3 అంతస్తుల భవనాన్ని నాబార్డు నిధులతో నిర్మించారు. 24 గంటలు మూగ జీవులకు వైద్య సేవలు అందించే విధంగా డాక్టర్లను కూడా పెంచాలనే ప్రతిపాదన ఉంది. ఈ ప్రతిపాదనలు మరుగున పడిపోగా.. స్థాయికి తగినట్లుగా కూడా సేవలు అందించకపోవడం గమనార్హం.
మెరుగైన వైద్య సేవలే అందిస్తున్నాం
బహుళార్ధ పశువైద్యశాలలో మెరుగైన వైద్య సేవలే అందిస్తున్నాం. డిజిటల్ ఎక్స్‌రే యూనిట్‌లో సాంకేతిక సమస్యలు ఏర్పడటంతో కొంత అంతరాయం కలిగింది. ఇతర పరీక్షల కోసం శాంపిల్స్ తీసి వ్యాధి నిర్ధారణ కేంద్రానికి పంపుతున్నాం. అక్కడ చేయని వాటిని బయటకు పంపుతున్నాం.
– డాక్టర్ హేమంత్‌కుమార్, డిప్యూటీ డైరెక్టర్,
బహుళార్ధ పశువైద్యశాల, కర్నూలు
అన్నీ బయటికే రాస్తున్నారు
దాదాపు పది నెలల ఒంగోలు జాతి కోడెదూడ కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉంది. మేత కూడా తినడం లేదు. స్థానిక పశువైద్యలలో చూపించినా ఫలితం లేకపోయింది. మెరుగైన వైద్యం కోసం కర్నూలు బహుళార్ధ పశువైద్యశాలకు తీసుకొచ్చాం. డాక్టర్లు వైద్య సేవలు బాగా అందిస్తున్నా మందులు, సూదులు, పరీక్షలు అన్నింటినీ బయటికే రాశారు. దీనివల్ల ఖర్చు ఎక్కువగానే వచ్చింది. – నారాయణ,
మిట్టకందాల, పాములపాడు మండలం
బహుళార్ధ పశువైద్య శాలలో అరకొర సేవలు
మూగజీవాలకు పరీక్షలన్నీ బయటికే
పశువులను ఎక్కడెక్కడో
తిప్పాల్సిన పరిస్థితి
వేధిస్తున్న మందుల కొరత
చికిత్సకోసం యజమానుల
జేబులు ఖాళీ
మూలనపడిన అధునాతన యంత్రాలు
పశువైద్యానికి ‘పరీక్ష’!