కర్నూలు సిటీ: న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ లక్ష్యాలను చేరుకోవాలంటే కష్టపడి పనిచేయాలని రాష్ట్ర హైకోర్టు జడ్జి, జిల్లా పోర్ట్ ఫోలియో జడ్జి జస్టిస్ బి.ఎస్ భానుమతి అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన న్యాయవాద సంఘం వార్షికోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాకు చారిత్రాత్మక పేరుందని, ఈ జిల్లా నుంచి చాలా మంది ఉన్నత న్యాయమూర్తులుగా రాణించారన్నారు. న్యాయపరంగా జిల్లా అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని హామీనిచ్చారు.
● హైకోర్టు జడ్జి జస్టిస్ కె. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. తాను ఈ జిల్లాకు చెందిన వాడినని, జిల్లా గురించి తనకు మంచి అవగహన ఉందన్నారు. కక్షిదారులకు న్యాయవాదులు అందుబాటులో ఉండి పని చేస్తే విజయాలు సొంతం అవుతాయన్నారు.
● జస్టిస్ ఎన్.హరినాథ్ మాట్లాడుతూ.. న్యాయవాదులు స్థానికంగానే కాకుండా అన్ని ప్రాంతాల్లో తిరిగి న్యాయ సేవలను కక్షిదారులకు అందించాలన్నారు. న్యాయవాది పనితనంపై ఆధారపడి కక్షిదారులకు న్యాయం అందుతుందన్నారు.
● న్యాయమూర్తి జస్టిస్ ఎ.హరినాథశర్మ మాట్లాడుతూ తాత్కాలిక ఆదాయానికి ఆశపడకుండా జూనియర్ న్యాయవాదులు పని చేస్తే భవిష్యత్తులో అభివృద్ధి వైపు వెళ్తారన్నారు. ప్రస్తుతం న్యాయవాదులు సాంకేతికతను అందిపుచ్చుకొని వృత్తిలో నైపుణ్యం పొందాలన్నారు.
● న్యాయవాద సంఘం వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన న్యాయమూర్తులకు, న్యాయవాదులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి, బార్ కౌన్సిల్ సభ్యులు పి.రవిగువేరా, బార్ అధ్యక్ష, కార్యదర్శులు బి. కృష్ణమూర్తి, బి.ఎస్ రవికాంత్, ప్రసాద్, సీనియర్ న్యాయవాదులు సి.నాగేంద్రనాథ్, ఎ.రామసుబ్బారెడ్డి, శివరామయ్య, జోగయ్య శర్మ, వై.జయరాజ్, ప్రభుత్వ న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టు జడ్జి భానుమతి
కష్టపడి పనిచేస్తే లక్ష్యం చేరుకోవచ్చు