
ప్రమాదాన్ని తరిమేలా.. ప్రాణాలు రక్షించేలా!
● కులుమాలలో ప్రమాదకరంగా విద్యుత్ తీగలు ● అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం ● రూ. 2.50 లక్షల సొంత నిధులతో సమస్యను పరిష్కరించిన బుట్టా రేణుక
గోనెగండ్ల: ‘సార్.. విద్యుత్ తీగలు ఇళ్ల ముందర వేలాడుతున్నాయి. మిద్దెలపైకి వెళ్లాంటే భయమేస్తోంది. విద్యుత్ తీగలు తగిలి ఓ వ్యక్తి చనిపోయాడు’ అని అధికారులకు ప్రజలు మొరపెట్టుకున్నా స్పందించ లేదు. చివరకు సమస్య వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుట్టా రేణుక దృష్టికి వెళ్లడంతో ఆమె సొంత నిధులతో పరిష్కరించారు. కులుమాల గ్రామంలోని బీసీ కాలనీలో గత 20 ఏళ్లుగా 11 కేవీ విద్యుత్ తీగలు ఇళ్లపై వెళ్లడం ద్వారా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటిపైకి వెళ్లాలంటే ఆ తీగలు తగిలి ప్రాణాలు పోతాయని భయపడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు. ఆ తీగలు తగిలి ఓ వ్యక్తి ప్రాణాన్ని కోల్పోయాడు. మరికొందరు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. చివరకు గ్రామంలో నెలకొన్న విద్యుత్ తీగల సమస్యను పరిష్కరించాలని ఆ గ్రామస్తులు వైఎస్సార్‌సీపీ జిల్లా ఆక్టివిటి కార్యదర్శి నాగేష్ నాయుడు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుట్టా రేణుక దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆమె సంబంధిత అధికారులతో మాట్లాడి సొంత నిధులు రూ.2.50 వెచ్చించి సమస్యను పరిష్కరించారు. రెండు రోజుల క్రితం కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి 11కేవీ విద్యుత్ తీగలను సురక్షిత మార్గంలో మార్పు చేసి సమస్యను పరిష్కరించడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ మేరకు బుట్టా రేణక, నాగేష్ నాయుడికి గ్రామస్తులతో పాటు వైఎస్సార్‌సీపీ మండల ఉపాధ్యక్షుడు పేట అల్లా బకాష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గొల్ల నరసింహుడు, వీరేష్, మద్దిలేటి, మద్ది, రాజు, దుబ్బన్న, మల్లికార్జున, రామాంజిని తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రమాదాన్ని తరిమేలా.. ప్రాణాలు రక్షించేలా!