
బేతంచెర్ల రైల్వేస్టేషన్ తనిఖీ
బేతంచెర్ల: స్థానిక రైల్వేస్టేషన్‌ను గుంతకల్ డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్త సిబ్బందితో కలిసి శనివారం సందర్శించారు. స్టేషన్‌లోని ప్లాట్‌ఫారాలు, ప్రయాణికుల సంఖ్య తదితర వివరాలను స్టేషన్‌మాస్టర్ రూప్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. కాగా రైల్వేస్టేషన్‌లోని రెండో ప్లాట్‌ఫారం కూర్చోవడానికి సౌకర్యంగా లేదని, గతంలో బేతంచెర్లలో ఆగే ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రస్తుతం ఆగకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు డీఆర్‌ఎం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆర్‌ఎస్ రంగాపురం రైల్వేస్టేషన్‌ను పరిశీలించారు.
నేటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు
కర్నూలు(అగ్రికల్చర్): వేసవి ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రత నేటి నుంచి పెరుగనున్నాయి. గురువారం మధ్యాహ్నం నుంచి ఉమ్మడి జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడటంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. శనివారం కూడా ఎండల తీవ్రత, వడగాల్పులు పెరిగాయి. కోసిగి, కర్నూలు అర్బన్, కోడుమూరు, దొర్నిపాడు, గడివేముల, కొత్తపల్లిలలో 39 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల 6 నుంచి ఉమ్మడి జిల్లాలో ఎండలు, వడగాల్పుల తీవ్రత పెరిగే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ అథారిటీ ప్రకటించింది. ఉపాధి పనులకు వెళ్లే కూలీలు, రైతులు, ఇతరులు వడగాల్పుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సాయంత్రం వేళల్లో అకాల వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం.