
రాష్ట్రంలో రాక్షస పాలన
● మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
కోవెలకుంట్ల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమాన్ని విస్మరించి రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిస్తున్నారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కాటసాని రామిరెడ్డి విమర్శించారు. పట్టణ శివారులోని వీఆర్, ఎన్‌ఆర్ ఫంక్షన్‌హాలులో సోమవారం వైఎస్సార్‌సీపీ వివిధ అనుబంధ విభాగాల మండల అధ్యక్షులు, పార్టీ మండల నూతన కమిటీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాటసాని మాట్లాడుతూ హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేశారన్నారు. పది నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. ఆకాశం వైపు చూస్తూ ఇచ్చిన హామీలను నెరవేర్చలేమని సిగ్గులేకుండా కూటమి నేతలు చెప్పుకుంటున్నారన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖమంత్రిగా ఉన్న బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి గ్రామాల్లో పేకాట క్లబ్‌లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మంత్రి అండదండలతోనే పేకాట, బెట్టింగ్‌లు జోరుగా కొనసాగుతున్నాయని వీటిని అరికట్టడంలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారన్నారు. టీడీపీ నేతలు ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఇసుక అక్రమ రవాణా దందా కొనసాగిస్తున్నారన్నారు.