
మారుమోగిన ఎర్రమల కొండలు
అవుకు: ఎర్రమల కొండల్లో వెలసిన శ్రీ లక్ష్మీ కంబగిరి స్వామి తిరుకల్యాణ మహోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి ఉప్పలపాడు గ్రామంలో స్వామివారిని ఆలయ పూజార్లు పట్టు వస్త్రాలతో అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని పెళ్లి కుమారుడిలా ముస్తాబు చేసి గ్రామస్తులందరికీ స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ గ్రామోత్సవం నిర్వహించారు. మంగళవారం ఉదయం ఉత్సవమూర్తులను ఉప్పలపాడు గ్రామం నుంచి స్వామివారి సేవకులు దాదాపు 12 కిలోమీటర్లు కాలినడకన పల్లకీలో జక్కలేరు వాగు వద్ద ఉన్న కంబగిరి స్వామి ఆలయానికి చేర్చారు. కంబగిరయ్య కొండకు చేరిన ఉత్సవమూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం చైత్ర శుద్ధ ద్వాదశి సందర్భంగా స్వామివారు హనుమద్ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.