
ముఖంపై తలుపులేసి.. ఏడడుగుల బంధాన్ని గెంటేసి!
సంతానం కలుగలేదని కర్కశత్వం
● నిత్యం భర్త, అతని తల్లిదండ్రుల
వేధింపులు
● కట్నకానుకలుగా రూ.3.50 లక్షల
నగదు, 5 తులాల బంగారం
● న్యాయం కోసం మెట్టినింటి మెట్లపై
ఎల్‌ఎల్‌బీ విద్యార్థిని
● పోలీసుస్టేషన్‌కు చేరిన పంచాయితీ
కర్నూలు: కర్నూలు శివారు జొహరాపురం దారిలోని లక్ష్మీ గార్డెన్ కాలనీలో నివాసముంటున్న మధుగోపాల్ సంతానం కలుగలేదని భార్య రమాదేవిని ఇంటి నుంచి గెంటేశాడు. ఇందిరాగాంధీ నగర్‌లో నివాసముంటున్న తెలుగు మన్యం, నాగలక్ష్మి దంపతులకు ముగ్గురు కొడుకులు, కూతురు సంతానం. రెండవ సంతానమైన రమాదేవికి మధుగోపాల్‌తో 2018 మార్చి 30న వివాహమైంది. కట్నకానుకలుగా రూ.3.50 లక్షల నగదు, 5 తులాల బంగారాన్ని ఇచ్చారు. రమాదేవి ఓ ప్రయివేట్ సంస్థలో టెలికాలర్‌గా పనిచేస్తుండగా.. మధుగోపాల్ ఓ ప్రయివేట్ హైస్కూల్‌లో తెలుగు టీచర్‌గా పనిచేస్తున్నాడు. వీరి సంసారం కొంతకాలం అన్యోన్యంగా సాగినా సంతానం కలుగలేదన్న సాకుతో భర్త, తల్లిదండ్రులు వేధించడం మొదలుపెట్టారు. వైద్యుల సూచన మేరకు రమాదేవి టెలికాలర్ ఉద్యోగాన్ని మానేసి రెండేళ్లుగా ఇంటి వద్దే ఉంటూ ఎల్‌ఎల్‌బీ చదువుతున్నారు. అయితే సంతానం కలుగలేదన్న కారణంతో కొంతకాలంగా భార్యాభర్తల మధ్య వివాదం చెలరేగి కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆమె కొంతకాలంగా పుట్టింట్లో ఉంటోంది. తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో బుధవారం భర్త ఇంటికి చేరుకుంది. భర్త బయటకు గెంటేసి తలుపులు మూసుకున్నాడు. దీంతో దాదాపు 3 గంటల పాటు ఆమె ఇంటి ముందే బైఠాయించింది. మూడో పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. ఆమెను స్టేషన్‌ను తరలించి విచారిస్తున్నారు.
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడు
సొంత భార్యనే వీధిన నిలిపాడు.
పిల్లలు కలుగలేదనే సాకుతో ఆమెను వదిలించుకునేందుకు సిద్ధమయ్యాడు.
ఏడుడుగులు నడిచి.. ఏడేళ్లు సంసారం చేసినప్పటికీ ఓ ఆడపిల్లకు అన్యాయం చేస్తూ ముఖంపైనే తలుపులు వేశాడు.
కట్నకానుకలు ఇచ్చినా.. భర్త మాటకు కట్టుబడి ప్రయివేటు ఉద్యోగం మానుకున్నా.. సంసారం చేసేది లేదంటూ తెగేసి చెప్పాడు.
పుట్టింట్లో ఉండలేక.. మెట్టినింట్లో అడుగు పెట్టలేక ఎల్‌ఎల్‌బీ చదువుతున్న ఈమె ‘న్యాయం’ కోసం నిరీక్షిస్తోంది.