
‘సాక్షి’పై ప్రభుత్వ కక్ష సాధింపు సిగ్గు చేటు
నంద్యాల: సాక్షి దినపత్రికలో ప్రచురితమైన వార్తపై నిజానిజాలు నిర్ధారించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ సాక్షి ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డితో పాటు ఆరుగురు విలేకరులపై కేసులు నమోదు చేయడం సిగ్గు చేటని జర్నలిస్టులు అన్నారు. ఏపీయూడబ్ల్యూజే, ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట శుక్రవారం జర్నలిస్టులు నిరసన తెలిపారు. సాక్షి ఎడిటర్ ధనుంజయ్‌రెడ్డి, మరో ఆరుగురు విలేకరులపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజకుమారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మౌలాలి మాట్లాడుతూ.. జర్నలిస్టులపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టడాన్ని నిరశిస్తున్నామన్నారు. ఈ నెల 3వ తేదీ పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పశువేముల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త హరిశ్చంద్ర టీడీపీ మూకల చేతిలో దారుణ హత్యకు గురయ్యారని, ఇందుకు సంబంధించిన వార్త సాక్షి దిన పత్రికలో ప్రచురితం అయ్యిందన్నారు. దీనిపై నిజానిజాలు నిర్ధారించుకోకుండా సాక్షి ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డితో పాటు ఆరుగురు విలేకరులపై ప్రభుత్వం కక్ష సాధింపుచర్యలకు పాల్పడుతూ కేసులు నమోదు చేయడం సిగ్గు చేటన్నారు. ఈ ఘటనను జర్నలిస్టులంతా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మేల్కొని తప్పుడు కేసులను రద్దు చేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమవకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. నిరసనలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు బాలమద్దిలేటి, జర్నలిస్టులు హరినాథరెడ్డి, ఎస్‌కే బాలునాయక్, గిరిబాబుసాగర్, దస్తగిరి, చంద్రవరప్రసాద్, అబ్దుల్‌కరీం, మోహన్, హుసేన్‌బాషా, రాము తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల నిరసన