
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించండి
గోస్పాడు: ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ.. జిల్లా నలుమూలల నుంచి ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చే రోగులకు వైద్యం అందించేందుకు డాక్టర్లు అందుబాటులో ఉండాలన్నారు. ఆసుపత్రికి అవసరమైన వైద్య పరికరాలు, మంచినీటి వసతి, మౌలిక సదుపాయాల కల్పనకు హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ నిధులను వినియోగించుకోవాలన్నారు. క్షతగాత్రులకు అత్యవసర వైద్య సేవలు అందించే క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. అల్ట్రాసౌండ్, ఎండోస్కోపీ, డయాలసిస్, ఎక్సరే పరికరాలు, బ్లడ్ బ్యాంకులో రిఫ్రిజిరేటర్లు, 24 గంటల ల్యాబ్, బయో కెమిస్ట్రీకి సంబంధించిన డిస్టిల్ వాటర్, తదితర రోగులకు అవసరమైన వైద్య పరికరాలను ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ నిధులను వినియోగించుకోవాలన్నారు. సమావేశంలో కమిటీ సభ్యులు శ్రీదేవి, శ్రీరామమూర్తి, శివశంకర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీదేవి, జీజీహెచ్ సూపరింటెండెంట్ మల్లేశ్వరి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్