భూసేకరణను వేగవంతం చేయాలి
నారాయణపేట: నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఎత్తిపోతల పథకం భూసేకరణ, కోస్గి రోడ్డు విస్తరణ పనులపై రెవెన్యూ, నీటి పారుదల శాఖ, ఆర్ అండ్ బీ, మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని మక్తల్, నారాయణపేట నియోజక వర్గాలలో భూసేకరణ ప్రక్రియను అధికారులు సమన్వయంతో చేపట్టాలన్నారు. జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ షాలోమ్ స్పందిస్తూ.. మొత్తం 556 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉందని, ఇప్పటి వరకు 16 గ్రామాలలో భూసేకరణ గాను ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని, ఈ గ్రామాల్లో మొత్తం 379.07 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉంటుందన్నారు. మిగతా 5 గ్రామాలలో భూసేకరణ ప్రాసెస్ లో ఉందని ఆర్డీవో రాంచందర్ నాయక్ తెలిపారు. అంతకుముందు కోస్గి రోడ్డు విస్తరణ పనులు ఎంతవరకు వచ్చాయని ఆరా తీస్తూ.. ఎలాంటి వివాదాలు లేకుండా అర్హతను బట్టి నష్ట పరిహారం చెల్లించి ముందుకు వెళ్లాలని, అవసరమైతే న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ గరీమా నరుల, అధికారులు రాములు, హీర్యా నాయక్, ఉదయ్ శంకర్, బ్రహ్మానందం, సతీష్, సురేష్ పాల్గొన్నారు.
వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి
వేసవి ఎండలు తీవ్రం కానున్న నేపథ్యంలో వడదెబ్బ సోకకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు విధిగా పండ్ల రసాలు, ఇంట్లో తయారు చేసిన పానియాలు తాగాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్‌లో ఈమేరకు మాట్లాడుతూ.. కూలీలు పని ప్రదేశంలో చల్లని తాగునీటిని ఏర్పాటు చేసుకోవాలని, కార్మికులు ఎండలో పనిచేయకుండా జాగ్రత్త వహించాలన్నారు. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు ఎండలో బయటకు రాకూడదని అన్నారు. అనంతరం దీనికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment