నారాయణపేట
మంగళవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
వివరాలు 8లో u
మరికల్: యాసంగిలో సాగు చేసిన వరి పంటలు కోతలకు రావడంతో అధికారులు ధాన్యం కొనుగోళ్లకు సన్నాహాలు చేపట్టారు. ఓవైపు ఆకాల వర్షాల భయం పట్టుకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోత వేసిన పంటలను త్వరగా ప్రభుత్వం కొనుగోలు చేట్టాలని కోరుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో యాసంగి కింద 1.50 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లాలో ముందుగా సాగు చేసిన కృష్ణా, మక్తల్ మండలంతోపాటు పలుచోట్ల ఇప్పటికే అక్కడక్కడ వరి కోతలు ప్రారంభమయ్యాయి. దీనికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగా కృష్ణా, మక్తల్ మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ఇటీవల ప్రారంభించారు.
1.35 లక్షల ఎకరాల్లో వరి సాగు
జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో యాసంగి సీజన్‌కు సంబందించి 1.07 లక్షల ఎకరాల్లో సన్నరకం వరి, మరో 28 వేల ఎకరాల్లో దొడ్డురకం సాగు చేశారు. మొత్తం ధాన్యం దిగుబడి దాదాపు 3 లక్షల టన్నులకుపైగా వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఏకంగా సన్నరకం వరి ధాన్యమే 2.50 లక్షల టున్నులకు పైగా వస్తుందని భావిస్తున్నారు. మిగితా దొడ్డురకం 50 వేల టున్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇందులో దాదాపు 3 వేల టన్నుల ధాన్యం రైతులు విత్తనం కోసం, మరో 30 వేల టన్నుల వరకు ధాన్యం అవసరం కోసం నిల్వ ఉంచుకునే అవకాశం ఉంది. మిగతా 2.70 లక్షల టన్నుల ధాన్యం అమ్మకానికి రావచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో అమ్మగా మిగిలినవి ప్రైవేట్ వర్తకులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
వెంటాడుతున్న అకాల వర్షాల భయం
గత వేసవితో పోలిస్తే ప్రస్తుత వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ముందుగానే ఆకాల వర్షాలు రావడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే పలుచోట్ల ఉరుములు, మెరువులతో కూడిన వర్షాలు కురువడంతో జిల్లాలో కోస్గి, మద్దూరు, కొత్తపల్లి మండలాల్లో 6,650 ఎకరాలకు పైగా పంట నష్టం వాటిళ్లింది. దీంతో రైతుల్లో ఆకాల వర్షాల భయం, ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది సైతం ధాన్యం కోతకు వచ్చే సమయం కొనుగోళ్ల సమయంలోనూ వర్షాలు పడటంతో పెద్దఎత్తున ధాన్యం తడిచి రైతులు నష్టపోయారు. ప్రతి సీజన్‌లోనూ దాదాపు వంద కొనుగోలు కేంద్రాలకు పైగా ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ చేపడుతున్నారు. ప్రస్తుతం వరికోతలు ప్రారంభం కావడంతో అవసరం ఉన్న మండలాల్లో అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. జిల్లా ఉన్నతాధికారులు సైతం ప్రత్యేకంగా కోనుగోలు కేంద్రాలు ధాన్యం సేకరణ తీసుకోవాల్సిన ఏర్పాట్లపై సమీక్షించనున్నారు.
జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు ప్రారంభిస్తాం
జిల్లా వ్యాప్తంగా 102 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే వరికోతలు ప్రారంభమైన కోస్గి, మక్తల్ మండలల్లో కేంద్రాలను ఏర్పాటు చేశాం. 1.50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాం. మరో వారం రోజుల్లో జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – సైదులు, సివిల్ సప్లయ్ సరఫరాల శాఖ డీఎం, నారాయణపేట
జిల్లాలో 102 కొనుగోలుకేంద్రాల ఏర్పాటుకు చర్యలు
1.50 లక్షల టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం
ప్రారంభమైన వరికోతలు
కృష్ణా, మక్తల్ మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ధాన్యం కొనుగోళ్లకు సన్నాహాలు