10 BBC Employees Spent 2 Nights In Office, Income Tax Survey Enters Day 3 - Sakshi
Sakshi News home page

బీబీసీ కార్యాలయాల్లో మూడో రోజూ ఐటీ సోదాలు.. 2 రాత్రులుగా ఆఫీసులోనే ఉద్యోగులు

Published Thu, Feb 16 2023 3:29 PM | Last Updated on Thu, Feb 16 2023 3:51 PM

10 BBC Employees Spent 2 Nights In Office IT Survey Enters Day 3 - Sakshi

బ్రిటీష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌(బీబీసీ) ఇండియా కార్యాలయాలపై మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగాయి. సర్వే ఆపరేషన్‌ పేరుతో ఐటీ అధికారులు చేపట్టిన దాడుల కారణంగా ఢిల్లీలోని బీబీసీలో పనిచేసే దాదాపు 10 మంది సీనియర్లు ఉద్యోగులు రెండు రోజుల నుంచి ఆఫీస్‌లోనే ఉంటున్నారు. ఆదాయపు పన్ను శాఖ సర్వే ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటికి వెళ్లలేదు. బీబీసీ కార్యాలయ ఉద్యోగుల నుంచి ఐటీ అధికారులు తమకు కావల్సిన ఆర్ధిక లావాదేవీల సమాచారాన్ని, డాక్యుమెంట్లు, మెయిల్స్, ఇతర వివరాల్ని సేకరించారు. 

కాగా 2002 గుజరాత్‌ జరిగిన అల్లర్లకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ ఇటీవల ఓ డాక్యుమెంటరీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇండియా ది మోదీ క్వశ్చన్‌ పేరుతో రిలీజ్‌ అయిన ఈ డాక్యుమెంటరీ దేశ వ్యాప్తంగా వివాదస్పదమైంది. దీనిని భారత్‌లో ప్రసారం చేయనీయకుండా కేంద్రం బ్యాన్‌ చేసింది. సోషల్‌ మీడియా మాధ్యమాలైన యూట్యూబ్‌, ట్విటర్‌ వంటి వాటిల్లో సంబంధిత లింక్‌లను తొలగించింది. ఇది జరిగిన రెండు వారాల్లోనే ఈ ఐటీ దాడులు ప్రారంభమవడం గమనార్హం. 

ఐటీ దాడుల నేపథ్యంలో ఢిల్లీలోని బీబీసీ సిబ్బంది ఒకరు మాట్లాడుతూ.. ఐటీ సోదాలు జరుగుతున్న కూడా తాము వార్తలను ఎప్పటిలాగే ప్రసారం చేస్తున్నామని తెలిపారు. అయితే చాలా మంది ఉద్యోగులు ఇళ్ల నుంచి పని చేస్తున్నారని పేర్కొన్నారు. కాగా పన్నుల ఎగవేత ఆరోపణలపై ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో మంగళవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన ఐటీ సోదాలు 44 గంటలు గడిచినా ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ దాడులు మరికొంత కాలం పాటు కొనసాగే అవకాశం ఉందని  అధికారులు  చెప్పారు. ఈ ఆపరేషన్ ఎప్పుడు పూర్తవుతుందనేది చెప్పలేమని.. తమకు లభించే ఆధారాల్ని బట్టి ఉంటుందని పేర్కొన్నారు.

ఆర్థిక లావాదేవీలు, కంపెనీ నిర్మాణం, ఇతర వివరాలపై ఐటీ సర్వే బృందాలు సమాధానాలు రాబడుతున్నాయి. సాక్ష్యాలను సేకరించే పనిలో భాగంగా ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి డేటాను కాపీ చేస్తున్నాయని ఐటీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా రాజకీయ ప్రతికారంతోనే బీబీసీ కార్యాలయాలపై కేంద్రం ఐటీ దాడులు జరిపిస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

ఇక వివాదాస్పద డాక్యుమెంటరీ నేపథ్యంలో భారతదేశంలో బీబీసీపై పూర్తి నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గత వారం కొట్టివేసిన విషయం తెలిసిందే. అలాగే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో డాక్యుమెంటరీ లింక్‌లను బ్లాక్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన మరో పిటిషన్‌పై ఏప్రిల్‌లో విచారణ జరగనుంది. 
చదవండి: హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు.. ‘అదానీ’పై మరో కేసు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement