ముంబై: బీజేపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను ఏడాదిపాటు సభ నుంచి బహిష్కరిస్తూ మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం తీర్మానాన్ని ఆమోదిం చింది. వారు స్పీకర్ చాంబర్‌లో ప్రిసైడింగ్ అధికారి భాస్కర్ జాదవ్‌తో అనుచితంగా ప్రవర్తించారని ప్రభుత్వం ఆరోపించింది. ఆ 12 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ సభా వ్యవహారాల మంత్రి అనిల్ పరబ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. సస్పెన్షన్ అమల్లో ఉన్నంతకాలం 12 మంది ఎమ్మెల్యేలు ముంబై, నాగపూర్‌లోని రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణాల్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదని అనిల్ పరబ్ స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వ ఆరోపణలను ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ ఖండించారు.
తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తమ సభ్యులను సస్పెండ్ చేయడం కాదు, సభా వ్యవహారాలను తామే బహిష్కరిస్తామని చెప్పారు. స్థానిక సంస్థల్లో ఓబీసీ కోటా అమలు విషయంలో ప్రభుత్వ నిర్వాకాన్ని తాము బయ టపెడుతు న్నామని, అందుకే సభలో ప్రతిపక్ష బలాన్ని తగ్గించేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ప్రిసైడింగ్ అధికారి భాస్కర్ జాదవ్‌ను బీజేపీ ఎమ్మెల్యేలు దూషించలేదన్నారు. అధికార శివసేన ఎమ్మెల్యేలే ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఫడ్నవిస్ చెప్పారు. భాస్కర్ జాదవ్ ఘటనపై సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీ అట్టుడికింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో నాలుగు సార్లు సభ వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment