సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పెచ్చరిల్లుతున్న అవినీతికి తగ్గట్లు ప్రజా ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వ నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వ విభాగాలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్రీకృత పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (సీపీగ్రామ్స్) ఆన్‌లైన్ పోర్టల్‌ను తీసుకొచ్చింది. అవినీతికి సంబంధించి ఏకంగా 46,627 ఫిర్యాదులు ఈ పోర్టల్ ద్వారా అందినట్లు ఆగస్టు–2022 నివేదిక వెల్లడించింది. ఈ లెక్కన రోజుకు 195 ఫిర్యాదులు దఖలుపడ్డాయి.
అత్యధికంగా ఫిర్యాదులు ఆర్థిక సేవల శాఖ (డీఎఫ్‌ఎస్)పైనే నమోదవడం గమనార్హం. డీఎఫ్‌ఎస్ పరిధిలోని బ్యాంకింగ్ విభాగంపై అధికంగా 14,934 ఫిర్యాదులు వచ్చాయి. బీమా విభాగంపై 3,306 ఫిర్యాదులు, సిబ్బంది, శిక్షణ విభాగం (డీఓపీటీ)పై 2,223, శాస్త్ర,సాంకేతిక విభాగంపై 1,831, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కార్యాలయంపై 1,784, ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖపై 1,005 ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 25 వరకు సీపీగ్రామ్స్ ద్వారా కేంద్రప్రభుత్వానికి మొత్తంగా 7,50,822 ఫిర్యాదులు అందాయి. వీటిలో 7,27,673 ఫిర్యాదులను పరిష్కరించారు. బ్యాంకింగ్ విభాగంలో 1,088, కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖలో 260 ఫిర్యాదుల్ని పరిష్కరించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment