![6 Rajya Sabha seat, one Bihar Mla seat Bypolls on October4: EC - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/9/ec.jpg.webp?itok=tRT1i942)
సాక్షి, న్యూఢిల్లీ: ఆరు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. 6 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలతోపాటు బిహార్‌లో ఒక శాసనమండలి స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగనుంది. అలాగే ఇటీవల ప్రకటించిన పశ్చిమ బెంగాల్, ఒడిశాలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను కూడా ఈసీ జారీ చేసింది.
అసోం, తమిళనాడు (2), మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఖాళీ అయిన 6 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈసీ షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 4న ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల (సెప్టెంబర్) 15న జారీ కానుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఒక ప్రకటన జారీ చేసింది. ఇక పుదుచ్చేరి రాజ్యసభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎన్ గోకులకృష్ణణ్ పదవీకాలం అక్టోబర్ 6 తో ముగియనుంది. ఈ స్థానానికి కూడా ఉప ఎన్నికలతో పాటే ఎన్నిక నిర్వహిస్తామని ఈసీ తాజా షెడ్యూల్‌లో పేర్కొంది.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అలాగే ఓట్ల లెక్కింపు కూడా అక్టోబర్ 4న ఉంటుంది. కాగా రాజ్యసభ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారన్ సంగతి విదితమే. రాష్ట్ర అసెంబ్లీలోనే ఓటింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి కట్టుదిట్టమైన భద్రతతో పాటు కరోనా మార్గదర్శకాల మధ్య ఉప ఎన్నికలు నిర్వహించనుంది.
Comments
Please login to add a commentAdd a comment