India home to about 60% of elephants in Asia - Sakshi
Sakshi News home page

ఏనుగమ్మా ఏనుగు.. విశ్వవేదికపై ఘీంకారం.. ఇంతకూ మన దేశంలో ఏనుగుల పరిస్థితి ఏమిటి ?

Published Wed, Mar 15 2023 3:22 AM | Last Updated on Wed, Mar 15 2023 9:06 AM

60 percent of elephants in Asia are in our country - Sakshi

ఏనుగుకి, మనిషికి మధ్య ఉండే భావోద్వేగ బంధం ప్రపంచాన్ని కదిలించింది. విశ్వవేదికపై ఏనుగుఘీంకారం ఆస్కార్‌ కుంభస్థలాన్ని కొట్టింది.డాక్యుమెంటరీలు తీసే వారికి ఎలిఫెంట్‌ విస్పరర్స్‌వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. మనిషికి, జంతువుకి, ప్రకృతికి మధ్య ఉండే గాఢానుబంధం మరోసారి చర్చకు వచ్చింది. మన దేశంలో ఏనుగుల పరిస్థితి ఏమిటి ?ఏనుగుల సంరక్షణ ఏ విధంగా ఉంది ?  

ఏనుగంటే మనకి ఒక జంతువు కాదు. అంతకంటే ఎక్కువే. గణనాథుడి మారురూపంగా గజరాజుల్ని పూజిస్తాం.. ఏనుగమ్మా ఏనుగు మా ఊరొచ్చింది ఏనుగు మంచినీళ్లు తాగింది ఏనుగూ అంటూ ఏనుగు మనకెంత ముఖ్యమైనదో చిన్నప్పట్నుంచి ఉగ్గుపాలతో నేర్పిస్తాం.

చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఏనుగుని చూడడమంటే అదొక సంభ్రమం. కానీ ఏనుగుల్ని కాపాడుకోవడంలో మనం అంతగా శ్రద్ధ కనబరచడం లేదనే చెప్పాలి. ఏనుగు దంతాల కోసం వాటిని వేటాడడం, ఏనుగుల ఆవాసాలైనా కారిడార్లను ఆక్రమించుకోవడం, ఏనుగుల కారిడార్లలోనే వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణం వంటి చర్యలతో ఏనుగుల సంరక్షణ ప్రశ్నార్థకంగా మారింది.  

సంరక్షణకి ఏం చేస్తున్నాం ?  
జీవవైవిధ్యానికి అత్యంత కీలకమైన ఏనుగుల్ని కాపాడుకోవడానికి 1992లో ఏర్పాటు చేసిన ఎలిఫెంట్‌ రిజర్వ్‌ ప్రాజెక్టు 30 ఏళ్లవుతున్నప్పటికీ అతీగతీ లేకుండా ఉంది. ఏనుగుల్ని కాపాడుకోవడానికి మనకి ప్రత్యేకంగా చట్టాలేమీ లేవు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం పరిధిలోకే ఏనుగులూ వస్తాయి. దీంతో ఏనుగులు ఆవాసం ఉండే కారిడార్లు, వాటి సంరక్షణకు ఏర్పాటు చేసిన రిజర్వ్‌ల నిర్వహణలన్నీ తూతూ మంత్రంగా జరిపిస్తున్నారు.

పర్యావరణ పరిరక్షణలో ఏనుగులెంత కీలకమో గ్రహించిన కేంద్రం 2010లో ఏనుగుని జాతీయ వారసత్వ జంతువుగా గుర్తించింది. ఏనుగుల సంరక్షణ విధానాలను సమీక్షించడానికి ఎలిఫెంట్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఈటీఎఫ్‌)ని ఏర్పాటు చేసింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని మార్చాలని, ఏనుగుల సంరక్షణ కోసం జాతీయ ఏనుగుల పరిరక్షణ అథారిటీని ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. అయితే నిధుల కొరతతో ఆ చర్యలేవీ కేంద్రం తీసుకోలేదు.

ప్రతీ ఏడాది ఏనుగుల సంరక్షణ కోసం రూ.30–35 కోట్ల నిధుల్ని మాత్రమే కేటాయిస్తున్నారు. 2020లో వన్యప్రాణుల సంరక్షణ చట్టంలో ఏనుగుల రిజర్వ్‌లను చేరుస్తూ సవరణలు చేశారు. 2022, ఆగస్టు 2న సవరణ బిల్లుని లోక్‌సభ ఆమోదించింది. అంతకు మించి ఏనుగుల రక్షణకు ప్రత్యేకంగా చర్యలేవీ తీసుకోలేదు.. 

ఏనుగులు, మనుషులకి మధ్య  ఘర్షణ
ఏనుగులకి, మనుషులకి మధ్య నిత్యం ఒక ఘర్షణ నెలకొని ఉంటుంది. మనిషి ఎప్పుడైతే అడవుల్ని కూడా ఆక్రమించడం మొదలుపెట్టాడో ఏనుగులు గుంపులు గుంపులుగా పంట పొలాలపైకి పడడం, రైతుల్ని తమ కాళ్ల కింద పడి తొక్కేసి ప్రాణాలు తీయడం వంటివి చేస్తున్నాయి. దీంతో రైతులు ఏనుగుల బారి నుంచి పంటల్ని కాపాడడానికి విద్యుత్‌ కంచెలు , కందకాలు ఏర్పాటు వంటివి చేయడంతో అవి చనిపోతున్నాయి.

ఇక ఏనుగు దంతాలకు అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా డిమాండ్‌ ఉండడంతో వాటిని అక్రమంగా వేటాడుతున్న వారూ ఉన్నారు. ఏనుగుల కారిడార్లలో రైల్వే ట్రాక్‌లు ఉండడంతో అవి బలైపోతున్నాయి. 1987–2017 మధ్య కాలంలో రైల్వే ట్రాక్‌ల కింద పడి 265 ఏనుగులు మరణించాయి. ఏనుగులు జరిపే దాడుల్లో ఏడాదికి సగటున 500మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే, ప్రజల చేతుల్లో ఏడాదికి సగటున 100 గజరాజులు మరణిస్తున్నాయి.

ఏనుగుల్ని మరింత సంరక్షించాలంటే, అవి ప్రజలు, పంట పొలాల జోలికి రాకుండా ఉండాలంటే ఏనుగులుండే కారిడార్లను పటిష్ట పరచాల్సి ఉంది. దేశంలో 110 ఏనుగు కారిడార్లు ఉన్నప్పటికీ 70% మాత్రమే వినియోగంలో ఉన్నాయి. 29% కారిడార్లు ఆక్రమణకి లోనయ్యాయి. 66% కారిడార్లలో జాతీయ రహదారుల వెంబడి వెళుతున్నాయి. 22 కారిడార్లలో రైల్వే లైన్లు ఉన్నాయి. ఏనుగుల తినే తిండి ఎక్కువ కావడంతో అవి ప్రతీ రోజూ చాలా దూరం ప్రయాణిస్తూ ఉంటాయి.

అవి సంచరించే మార్గాల్లో జాతీయ రహదారులు, రైల్వే ట్రాక్‌లు, మైనింగ్‌ తవ్వకాలు, కాలువలు, ఫెన్సింగ్‌లు ఉండడం వాటికి దుర్భరంగా మారింది. రైళ్లు, వాహనాల కింద పడి ప్రమాదవశాత్తూ మరణిస్తున్నాయి. అందుకే ఏనుగులు సంచరించే కారిడార్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు చెబుతున్నారు. ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారుల్లో ఏనుగుల సంచారం కోసమే ప్రత్యేకంగా వంతెనలు నిర్మించడం విశేషంగా చెప్పుకోవాలి 

- సాక్షి, నేషనల్‌ డెస్క్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement