న్యూఢిల్లీ: సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత సుప్రీంకోర్టు చొరవతో ఆ కానిస్టేబుల్ కుటుంబానికి న్యాయం లభించింది. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆరు వారాల్లోగా ఆ కానిస్టేబుల్ కుమారునికి ప్రభుత ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.
వివరాల్లోకి వెళితే యూపీలోని అలీఘర్ నివాసి వీరేంద్ర పాల్ సింగ్ తండ్రి శిశుపాల్ సింగ్ యూపీ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఆయన 1995లో అనారోగ్యంతో మరణించాడు. ఆ సమయంలో అతని కుమారుడు వీరేంద్ర పాల్ సింగ్ మైనర్ కావడంతో, అతని తల్లి కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగం కోసం ప్రభుత్వాన్ని సంప్రదించలేదు.
అయితే 13 సంవత్సరాల తరువాత మేజర్ అయిన వీరేంద్ర పాల్ సింగ్ 2008లో కారుణ్య నియామకం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయంలో జాప్యం జరిగిన కారణంగా యూపీ ప్రభుత్వం ఆ దరఖాస్తును తిరస్కరించింది. అయితే ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వీరేంద్ర పాల్ సింగ్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై పునర్విచారణ జరపాలని హైకోర్టు సింగిల్ బెంచ్ యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశాన్ని యూపీ ప్రభుత్వం పునరాలోచన చేసి, తిరస్కరించింది.
కారుణ్య నియామకానికి దరఖాస్తు చేయడంలో జరిగిన జాప్యాన్ని మన్నించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది. ఇలా కోర్టులో వాదప్రతివాదనలతో చాలా ఏళ్లు గడిచిపోయాయి. అయితే 2021లో అలహాబాద్ హైకోర్టు సింగిల్ బెంచ్ యూపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. నాలుగు నెలల్లోగా వీరేంద్రకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంపై పరిశీలించాలని కోరింది. యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సవాలు చేసింది. అయితే అది 2022లో దానిని తిరస్కరణకు గురయ్యింది. అతని కారుణ్య నియామకాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది.
దీనిపై యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సుప్రీం కోర్టులో జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సందీప్ మెహతాలు.. యూపీ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేస్తూ, హైకోర్టు తీసుకున్న నిర్ణయంలో తమకు లోపం కనిపించలేదని పేర్కొన్నారు. ఎటువంటి తప్పు లేకుండా 2010 సంవత్సరం నుండి ఈ కేసును కొనసాగిస్తున్నారని, తాము ఈ అప్పీల్‌ను స్వీకరించడానికి ఇష్టపడటం లేదని, దీనిని కొట్టివేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఈ ఉత్తర్వు కాపీ అందిన నాటి నుంచి ఆరు వారాల వ్యవధిలోగా ప్రతివాదికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కానిస్టేబుల్ కుమారుని తరపున న్యాయవాది వంశజా శుక్లా వాదనలో పాల్గొన్నారు. కాగా కానిస్టేబుల్ శిశుపాల్ సింగ్ 1992లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అనారోగ్యానికి గురై, చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
ఇది కూడా చదవండి: నేటి పార్లమెంట్‌లో.. ముచ్చటగా ముగ్గురు ‘గాంధీ’ ఎంపీలు
Comments
Please login to add a commentAdd a comment