సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...!
మత్తు చల్లుతున్నారు
ఇదే కాశీ కారిడార్ నిర్మాణం అయిన ఉత్తరప్రదేశ్‌లో వేలాది మంది ప్రభుత్వ వైఫల్యం వల్ల కోవిడ్‌తో చనిపోయారు. ఈ సత్యాన్ని ఏ మత మత్తుమందు కూడా అణిచివేయలేదు. మనం మతానికంటే పాలనకు ప్రాధాన్యత ఇచ్చివుంటే ఇందులో చాలా జీవితాలను కాపాడగలిగేవాళ్లం.
– అర్ఫా ఖానమ్ షేర్‌వానీ, జర్నలిస్ట్
అందుకే చూశారా?
విశ్వసుందరి పోటీదారులు ఇచ్చినవి మూర్ఖపు జవాబులని చాలామంది ట్రోల్ చేస్తున్నారు; వీళ్లేదో నిజంగానే జ్ఞాన సముపార్జనకు ఆ కార్యక్రమం చూసినట్టు. అది అందాల పోటీ నాయనా, క్విజ్ ప్రోగ్రామ్ కాదు.
– అహ్మద్ షరీఫ్, కమెడియన్
వెనుకడుగులు
ప్రధానమంత్రి చురుగ్గా ఉండే మెజారిటీ వర్గపు వారి పూర్తి మతపరమైన కార్యక్రమాలను ఇంకే దేశాలైనా ఇలా ప్రసారం చేస్తాయా? రోజురోజుకీ మనం ప్రజాస్వామ్యం, లౌకికవాదాల పరంగా ఒక్కో అడుగు వెనక్కి వేస్తున్నాం.
– అజయ్ కామత్, నేత్ర వైద్యుడు
టీకా వివక్ష
ప్రపంచంలో చాలా దేశాలు కోవిడ్ బూస్టర్ డోసుల వెయ్యడానికి సిద్ధమవుతున్నాయి. కానీ మాలావీ (ఆఫ్రికా దేశం)లో కేవలం సుమారు ఆరు లక్షల మందికే ఇప్పటివరకూ పూర్తి టీకాలు పడ్డాయి. 1.8 కోట్ల జనాభాలో ఇది ఏపాటి? ఒమిక్రాన్‌తో నాలుగో వేవ్ వ్యాపిస్తున్న సమయంలో ఇది అన్యాయం కాదా? టీకాలు ప్రపంచంలో అందరికీ సమానంగా అందాలి.
– కిసోమో కలింగా, పరిశోధకురాలు
రంధ్రాన్వేషకులు
జనంలో నిజంగానే ఏదో భాగం కుళ్లిపోయింది. ఒక విషయాన్ని సుసాధ్యం చేసిన ప్పుడు కూడా దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేరు. మనం ఇలా ఎందుకు తయారవుతున్నాం? కాశీ కారిడార్ అనేది ప్రగతి. దీన్నెందుకు జీర్ణించుకోరు? ప్రతిదానిలోనూ తప్పు పట్టాలని ఎందుకు చూస్తారు? చేసినదానికి ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వండి.
– సుహేల్ సేఠ్, రచయిత
అవే అందం
ఒక విదేశీయుడిగా నేను చెప్పగలను. సంప్రదాయాలు, ఆచారాలే భారత్‌ను ప్రత్యేకంగా నిలబెడతాయి. నాకు చాలా నచ్చాయి.
– కోబీ శోషానీ, ఇజ్రాయిల్ ఉన్నతాధికారి
అసలు అర్థం
ఒక నాయకుడు తరచుగా గతాన్ని రెచ్చగొడుతున్నాడంటే, భవిష్యత్ దిశగా అతడి దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదని అర్థం.
– సంజయ్ ఝా, కాంగ్రెస్ మాజీ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment