న్యూఢిల్లీ: మనుషుల్లో రోగ నిరోధక శక్తి క్షీణించడం, మరింత వేగంగా వ్యాప్తి చెందే కరోనా వైరస్ వేరియంట్ పుట్టుకురావడం, లాక్‌డౌన్ నిబంధనల్లో విచ్చలవిడిగా సడలింపులు ఇవ్వడం వంటి కారణాలు మూడో వేవ్ ముప్పునకు కారణమయ్యే అవకాశం ఉందని ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. సామాజిక దూరం కచ్చితంగా పాటించడం, మాస్కులు ధరించడం, వ్యాక్సిన్ తీసుకోవడం వంటి చర్యలతో కరోనా థర్డ్ వేవ్ తీవ్రతను తగ్గించవచ్చని సూచించారు.
మూడో వేవ్ నియంత్రణ మన చేతుల్లోనే ఉందన్నారు. తదుపరి కరోనా వేవ్ సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే పలు అధ్యయనాలు జరిగినట్లు పేర్కొన్నారు. అన్ని ఆంక్షలను ఎత్తివేస్తే, రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకొనే కరోనా వేరియంట్ తప్పించుకోగలిగితే రెండో వేవ్ కంటే మూడో వేవ్ ఉధృతి అధికంగా ఉంటుందని వెల్లడించారు. కొన్ని ఆంక్షలను కఠినంగా అమలు చేస్తే కరోనా మహమ్మారి సైతం నియంత్రణలోనే ఉంటుందని, పాజిటివ్ కేసులు పెరగవని రణదీప్ గులేరియా స్పష్టం చేశారు. మరికొన్ని ఆంక్షలు, నిబంధనలను అమల్లోకి తీసుకొస్తే కేసుల సంఖ్య క్రమంగా తగ్గే అవకాశం ఉందన్నారు. కరోనాలో కొత్త వేరియంట్లు పురుడుపోసుకున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment