న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పునర్వవ్యస్థీకరణ సవరణ బిల్లుకు శనివారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్లుపై జరిగిన చర్చకు హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే అంశంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌కు సరైన సమయంలో రాష్ట్ర హోదా ఇస్తామని ప్రకటించారు. పునర్వవ్యస్థీకరణ బిల్లు తేవడమంటే రాష్ట్ర హోదా ఇవ్వబోమని కాదన్నారు. పైగా బిల్లులో జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వబోమని ఎక్కడా లేదని.. దీనిపై విపక్షాలు వక్రభాష్యం చెబుతున్నాయని మండి పడ్డారు. జమ్మూకశ్మీర్ అంశంలో గత 70 ఏళ్లుగా కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. గతంలోలా హింస, అశాంతితో కూడిన రోజులు ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో లేవు.. తిరిగి రావని స్పష్టం చేశారు. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే మోదీ సర్కార్ ధ్యేయమని అమిత్ షా తెలిపారు.
పునర్వవస్థీకరణ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా కొందరు సభ్యులు ఈ ప్రాంతం తిరిగి రాష్ట్ర హోదా పొందుతుందన్న విశ్వాసం తమకు లేదంటూ చేసిన వ్యాఖ్యలకు అమిత్ షా సమాధానమిచ్చారు. తగిన సమయంలో రాష్ట్ర హోదా కల్పిస్తామని వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌లో అధికార పంపిణీ, అధికార వికేంద్రీకరణ జరిగిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 51శాతానికి పైగా పోలింగ్ జరగడాన్ని ఆయన ప్రస్తావించారు. తమ ప్రత్యర్థులు కూడా ఎత్తిచూపని విధంగా ఎన్నికలు శాంతియుతంగా జరిగాయని తెలిపారు.
25వేల ప్రభుత్వ ఉద్యోగాలు!
ఈ ప్రాంతంలో రెండు ఎయిమ్స్ పనులు ప్రారంభమయ్యాయని, కశ్మీర్ వ్యాలీకి 2022 కల్లా రైలు మార్గం ఏర్పాటవుతుందని చెప్పారు. అక్కడి ప్రజలెవరికీ భూములు కోల్పోతామన్న ఆందోళన అవసరం లేదన్నారు అమిత్ షా. అభివృద్ధి పనులకు అవసరమైన భూమి ప్రభుత్వం వద్ద ఉందని చెప్పారు. 2022 నాటికి జమ్మూకశ్మీర్‌లో 25వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. అనంతరం జమ్మూకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ (సవరణ) బిల్లును లోక్‌సభ ఆమోదించింది.
జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టులో రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజ్యసభలో ఆమోదం పొందిన జమ్మూకశ్మీర్ పునర్వవ్యస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
చదవండి: దారుణం.. ప్రాణం తీసిన జలుబు
కెడిసేథి; ఒక తరం సైద్ధాంతిక స్వరం
Comments
Please login to add a commentAdd a comment