గువహతి: షారూఖ్ ఖానా? అసలు అతనెవరు? అతని గురించి నాకేం తెలియదు. అతని సినిమా పఠాన్ గురించి కూడా నాకేం తెలియదు.. ఈ కామెంట్లు చేసింది ఎవరో కాదు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ. శనివారం గువాహతిలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాకు ఈ సమాధానాలు ఇచ్చారు.
పఠాన్ సినిమాను అడ్డుకుంటామని బజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. అక్కడి మీడియా అసోం సీఎంను స్పందించాలని కోరింది. దీనికి ఆయన బదులిస్తూ.. షారూఖ్ ఖాన్ ఎవరని, ఆ సినిమా గురించి కూడా తనకు తెలియదని సమాధానం ఇచ్చారు. ‘‘బాలీవుడ్ నుండి చాలా మంది తమ సమస్యల గురించి ఫోన్ చేశారు. కానీ, ఆ ఖాన్ ఎవరో నాకు ఫోన్ చేయలేదు. ఒకవేళ అతను గనుక చేస్తే.. విషయాన్ని పరిశీలిస్తా’’ అని సీఎం హిమంత మీడియాకు తెలిపారు.
నరెంగిలో శుక్రవారం సాయంత్రం పఠాన్‌ను ప్రదర్శించబోయే ఓ థియేటర్‌పై బజరంగ్ దళ్ కార్యకర్తలు దాడి చేసి.. పోస్టర్లను చించేసి దహనం చేశారు. ఈ పరిణామంపై స్పందించిన సీఎం.. శాంతి భద్రతలకు ఎవరు భంగం కలిగించినా ఊరుకునేది లేదని, ఘటనకు సంబంధించి కేసు నమోదు అయ్యిందని.. చర్యలుంటాయని సమాధానం ఇచ్చారు. ఇక షారూఖ్ ఖాన్ అంటే.. బాలీవుడ్ సూపర్ స్టార్ అని విలేకరులు చెప్పగా.. రాష్ట్ర ప్రజలు అస్సామీ చిత్రాల గురించి ఆలోచించాలే తప్ప.. హిందీ చిత్రాల గురించి కాదని చెప్పారు. దివంగత నిపోన్ గోస్వామి దర్శకత్వం వహించిన డాక్టర్ బెచ్‌బరౌవా-పార్ట్2(అస్సామీ చిత్రం) త్వరలో విడుదల కాబోతోందని, ప్రజలంతా ఆ సినిమా చూడాలని ఆయన అసోం ప్రజలకు పిలుపు ఇచ్చారు.
యాక్షన్ చిత్రాల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో షారూఖ్ ఖాన్, జాన్ అబ్రహం, దీపికా పదుకునే ప్రధాన పాత్రల్లో తెరకెక్కింది పఠాన్. ఈ చిత్రం జనవరి 25వ తేదీన దేశవ్యాప్తంగా రిలీజ్ కానుంది. బేషరమ్ రంగ్ అనే పాటలో కాషాయం రంగు బికినీ ధరించిందని, అది హిందుత్వాన్ని కించపరిచినట్లేనని చెబుతూ వీహెచ్‌పీ సహా హిందూ అనుబంధ సంఘాలు ఈ చిత్రాన్ని నిషేధించాలని పట్టుబడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment