కోర్టు అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించిందంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం అసోం ప్రభుత్వానికి ధిక్కార నోటీసు జారీ చేసింది. కామరూప్ మెట్రో డిస్ట్రిక్ట్ పరిధిలోని సోనపుర్ మువాజ ప్రాంతానికి చెందిన 47 మంది పౌరులు దాఖలు చేసిన పిటిషన్‌న్‌పై నేడు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని రాష్ట్రాన్ని ఆదేశించింది.
తదుపరి విచారణ వరకు కూల్చివేతలను ఆపేయాలంటూ, యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. కాగా రోడ్లు, ఫుట్‌పాత్‌లు, రైల్వే లైన్లు, వాటర్‌బాడీస్‌లో ఉన్న నిర్మాణాలను తప్పితే.. మిగిలిన వాటిని కూల్చే ముందు న్యాయస్థానాల అనుమతి తప్పనిసరి అంటూ సెప్టెంబర్ 17న కోర్టు చెప్పింది. అయినా తమ ఇళ్లను కూల్చడంపై బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాన్ని ఉల్లంఘించి అధికారులు తమ ఇళ్లను కూల్చివేశారని, అలాగే అసోం అడ్వకేట్ జనరల్ సెప్టెంబరు 20న గౌహతి హైకోర్టుకు తమ పిటిషన్లను పరిష్కరించే వరకు తమపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చారని పిటిషనర్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment