సరిహద్దులో కాల్పుల ఘటన ఉద్రిక్తతలతో మేఘాలయ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఏడు జిల్లాల్లో 48 గంటలపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అసోం(పూర్వ అస్సాం)-మేఘాలయ సరిహద్దు వెంట జరిగిన కాల్పుల్లో రాష్ట్రానికి చెందిన ఐదుగురు మరణించారు. దీంతో.. సోషల్ మీడియాలో వందతులు వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ఇరు రాష్ట్రాల సరిహద్దులో పశ్చిమ జైంటియా హిల్స్ వద్ద అక్రమ కలప రవాణాను అడ్డుకునే క్రమంలో ఘర్షణలు తలెత్తినట్లు తెలుస్తోంది. అస్సాం పోలీసులు-ఫారెస్ట్ అధికారులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మేఘాలయకు చెందిన వ్యక్తులతో పాటు ఘర్షణల్లో అస్సాంకు చెందిన ఓ ఫారెస్ట్ గార్డు చనిపోయినట్లు మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా మంగళవారం వెల్లడించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. ఈ ఉదయం(మంగళవారం) 10.30 నుంచి 48 గంటలపాటు ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపిన మేఘాలయ పోలీసులు.. ఎఫ్‌ఐఆర్ నమోదు అయినట్లు వెల్లడించారు. మరోవైపు అసోం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో మాత్రం ఉద్రిక్తతలు చల్లారడం లేదు. మంగళవారం ఉదయం అక్రమ కలప రవాణా చేస్తున్న ట్రక్కును అడ్డగించడంతో అస్సాం-మేఘాలయ సరిహద్దులో హింస చెలరేగింది. అసోం పరిధిలోని పశ్చిమ కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని ముక్రు ప్రాంతంలో అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో.. మేఘాలయలోని పశ్చిమ జైంటియా హిల్స్ జిల్లా ముఖో వైపు అక్రమంగా కలప తరలిస్తున్న టింబర్‌ను అసోం అటవీ శాఖ బృందం అడ్డుకుంది. ఈ క్రమంలో వాళ్లు పారిపోయే క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు.
ఈ ఘటన తర్వాత ఫారెస్ట్ సిబ్బంది జిరికెండింగ్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని భద్రతను పెంచారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న తర్వాత.. మేఘాలయ నుంచి ఆయుధాలతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉదయం ప్రాంతంలో అక్కడకు వచ్చారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ఫారెస్ట్ గార్డులు, పోలీసు సిబ్బందిపై దాడి చేశారని తెలిపారు. ఈ క్రమంలోనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కాల్పులు జరపాల్సి వచ్చిందని అస్సాం పోలీసులు వివరణ ఇచ్చుకున్నారు.
ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉండగా.. మేఘాలయ సరిహద్దు పంచుకుంటున్న జిల్లాల్లో అసోం పోలీసులు భద్రతను పెంచారు. ఐదుగురు కూడా బుల్లెట్ గాయాలతో మరణించారా లేదా మరేదైనా ఆయుధం తగలడంతో మృతిచెందారా? అసోం ఫారెస్ట్ మరణానికి కారణం ఏంటన్న దానిపై అసోం పోలీసుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. అస్సాం గార్డులే మొదటగా టింబర్ల టైర్లను కాల్చారని చెప్తున్నారు. నలుగురు ఘటనా స్థలంలోనే మరణించగా.. మరొకరు చికిత్స పొందుతూ చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో ఫారెస్ట్ గార్డు గాయపడి మరణించినట్లు సమాచారం.
1972లో మేఘాలయ అస్సాం నుండి వేరు అయ్యింది. అప్పటి నుంచి అస్సాం పునర్వ్యవస్థీకరణ చట్టంపై చర్చ నడుస్తూనే వస్తోంది. ఇరు రాష్‌ట్రాలు గతేడాది ఆగస్టులో మూడు ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని ఈ సమస్య పరిష్కారానికి సిద్ధం అయ్యాయి. ఇరు రాష్ట్రాల సీఎంలు.. ఓ డ్రాఫ్ట్ రెజల్యూషన్‌ను హోం మంత్రి అమిత్ షాకు జనవరి 31వ తేదీన సమర్పించాయి.
ఒప్పందాల నడుమే ఉద్రిక్తతలు
ఇరు రాష్ట్రాలకు సంబంధించి 884.9 కిలోమీటర్ల సరిహద్దు వెంట 12 వివాదాస్పద ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో ఆరింటికి సంబంధించి పరిష్కారం కోసం మార్చి నెలలో.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా ఒక ఒప్పందం చేసుకున్నారు. దీంతో.. ఐదు దశాబ్దాల నాటి వివాదాన్ని ఓ కొలిక్కి వస్తుందని అంతా అనుకున్నారు. ఇక.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఈ ఒప్పందం చారిత్రాత్మకమని, సంతకంతో 70% వివాదం పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. ఆగస్టులో మిగిలిన ప్రాంతాల్లో వివాదాన్ని పరిష్కరించేందుకు శర్మ, సంగ్మా చర్చలు జరిపారు. అవి ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఈలోపు..
అస్సాం 18.51 స్క్వేర్ కిలోమీటర్లు, మేఠాలయా 18.21 స్క్వేర్ కిలోమీటర్లు ఉంచేసుకోవాలని ప్రతిపాదించాయి. తొలిదశలో 36 గ్రామాలకు సంబంధించి ఒప్పందం కుదిరింది కూడా.
ఇదిలా ఉంటే.. మిజోరాంతోనూ గతంలో ఇలాగే సరిహద్దు విషయంలో ఘర్షణలు తలెత్తాయి. 2021లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు అస్సాం పోలీసులు దుర్మరణం పాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment