‘ది లెజెండ్ ఆఫ్ భగత్‌సింగ్’ సినిమాకు స్క్రిప్టు రాయడానికి నేను పరిశోధన చేపట్టినప్పుడు నన్ను నిరంతరం తొలిచిన ప్రశ్న– అసలు ఆయన ఎందుకు ప్రాణాలను బలిపెట్టాలను కున్నారు? రాజకీయ చైతన్యం పుష్కలంగా ఉన్న కుటుంబంలో జన్మించిన భగత్‌సింగ్‌కు బాలుడిగా ఉన్నప్పుడే భారతదేశం పరాయి దేశ పాలనలో ఉందనే సంగతి తెలుసు. అయితే, జలియన్‌వాలా బాగ్ ఊచకోత తరువాతనే విదేశీ పాలన ఘోరమైన పరిణామాలను ఆయన ఆర్థం చేసుకోగలిగారు. అక్కడి దృశ్యాలు ఆయనను ఎంతగా కదలించాయంటే, అక్కడ రక్తంతో తడిసిన మట్టిని ఒక సీసాలోకి నింపి, ఆనాటి ఘోరకలికి గుర్తుగా భద్రపరచుకున్నారు.
పరాయి పాలనలో మగ్గుతున్నప్పుడు ఇలాంటి దారుణాలు అనివార్యమనే సంగతిని తనకు ఆ సీసా జీవితాంతం గుర్తు చేయాలని భగత్ భావించారు. బ్రిటిష్ పోలీసుల లాఠీ దెబ్బలకు తీవ్రంగా గాయపడి లాలా లజపతి రాయ్ మరణించినప్పుడు భగత్ ఆగ్రహంతో రగిలిపోయారు. అణచివేతదారుల హింసను విప్లవాత్మక ప్రతి హింసతో ఎదుర్కోవాలని ఆయన భావించారు. లాలాపై లాఠీ ప్రయోగించిన అధికారి మీద తన స్నేహితులతో కలిసి నాలుగు తూటాలు పేల్చారు. అది భగత్ జీవితాన్ని మలుపు తిప్పిన ఘటన.
చదవండి: స్వతంత్ర భారతి: డియర్ గెస్ట్.. నేను మీ కెప్టెన్
బ్రిటిష్ అధికారిని చంపినందుకు ప్రభుత్వం తనను ఉరి తీస్తుంది. దాని గురించి భగత్‌సింగ్‌కు భయం లేదు. ఆయనకు ముఖ్యమైనది భారతదేశానికి స్వాతంత్య్రం సాధించాలన్న ఆశయమే. ఆ లక్ష్య సాధనకు తన జీవితం లేక మరణమనేవి సాధనాలు మాత్రమే. అలా 23 ఏళ్లకే భగత్ సింగ్ పరిపూర్ణ ఆదర్శవాదిగా మారిపోయారు. ఆయన లక్ష్యం ఆయన ప్రాణాలకంటే మించినది. ప్రేమించిన వారి కోసం కాకుండా ఒక లక్ష్యం కోసం ఆనందంగా ప్రాణాలను బలిపెట్టాలనుకునే మనఃస్థితి ఎలా ఉంటుంది?
నిజం చెప్పాలంటే అదెలా ఉంటుందో నాకు ఇప్పటికీ తెలియదు. నేడు ప్రతి ఒక్కరూ భగత్‌సింగ్‌ను తమవాడంటున్నారు. చివరకు సంఘ్ పరివార్ కూడా. సంఘ్ రాజకీయాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తుంచుకోవాలి. ఆయన విశిష్టతను నిజంగా తెలుసుకోవడమంటే, శౌర్య సారాన్ని అవగాహన చేసుకోవడమే. భగత్‌సింగ్ శౌర్యం తుపాకీ పేల్చడంలో లేదు. ఆయన ఆదర్శాలు, ఆచరణల మేళవింపులోనే ఉంది.
– అంజుం రాజాబాలి
(రాజాబలి మాటలు రాసిన బాలీవుడ్ చిత్రం ‘ది లెజెండ్ ఆఫ్ భగత్‌సింగ్’ విడుదలై నేటికి ఇరవైఏళ్లు)
Comments
Please login to add a commentAdd a comment