సాహసోపేత భారత సైనికుడు, జాతీయ హీరో.. ఫీల్డ్ మార్షల్ మానెక్‌షా పూర్తి పేరు శాం హోర్ముస్‌జీ ఫ్రేంజీ జెమ్‌షెడ్జీ మానెక్ షా . 1971లో పాకిస్తాన్‌తో యుద్ధంలో భారత్‌కు అతిపెద్ద సైనిక విజయాన్ని సాధించి పెట్టి, బంగ్లాదేశ్ ఆవిర్భావానికి అద్యుడయ్యారు. షా తన కెరీర్‌లో మొత్తం ఐదు యుద్ధాలలో పాల్గొన్నారు. గూర్ఖా రైఫిల్స్‌తో ఆయనకున్న అనుబంధానికి గుర్తుగా అందరూ ప్రేమతో ఆయనను ‘శ్యామ్ బహదూర్’ అని పిలుచుకునేవారు. షా అమృత్‌సర్‌లోని పార్శీ దంపతులకు జన్మించారు. నలుగురు అన్నలు, ఇద్దరు అక్కలు. బ్రిటిష్ హయాం మొదలుకొని నాలుగు దశాబ్దాల పాటు సైన్యంలో సేవలు అందజేసిన శాం మానెక్‌షా– రెండవ ప్రపంచ యుద్ధంలోను, భారత స్వాతంత్య్రానంతరం చైనా, పాకిస్థాన్‌లతో జరిగిన మూడు యుద్ధాల సందర్భంగాను ప్రదర్శించిన వ్యూహ చతురత, బుద్ధికుశలత అమోఘమైనవి.
రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు జపాన్ ఆక్రమిత దళాలను తిప్పికొట్టేందుకు ఉద్దేశించిన సైనిక విభాగం అధిపతిగా బర్మాలో ఆయన ప్రాణాలొడ్డి పోరాడారు. కడుపులోకి ఏడు గుళ్లు దూసుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు. అపూర్వ ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు ఇచ్చే అత్యున్నత పతకం ‘మిలిటరీ క్రాస్’ను అమర వీరులకు ప్రకటించరాదన్నది నియమం. అందుకే మానెక్‌షా బతికి బట్టకట్టకపోవచ్చునని భావించిన నాటి మేజర్ జనరల్ డి.టి.కోవన్, తన ‘మిలిటరీ క్రాస్ రిబ్బన్’ను తక్షణం మానెక్‌షాకు ప్రదానం చేశారు.
అదృష్టవశాత్తూ మృత్యుముఖంలోంచి బయటపడిన మానెక్‌షా, మరోసారి బర్మాలో జపాన్ సైనికులను ఢీకొన్నారు. మళ్లీ గాయపడినప్పటికీ వెన్నుచూపలేదు. జపాన్ సైనికులు లొంగిపోయాక, 10 వేల మందికిపైగా యుద్ధఖైదీలకు పునరావాసం కల్పించడంలో కూడా షా కీలకపాత్ర పోషించారు. 1947లో దేశవిభజన, 1947–48లో జమ్మూకశ్మీర్‌లో సైనికచర్యల సందర్భంగా ఆయన తన పోరాట సామర్థ్యాలను మరోమారు లోకానికి చాటిచెప్పారు. 1937లో షా లాహోర్‌లో ఉన్నప్పుడు ఓ కార్యక్రమంలో సిల్లూ బోడె ను ఆయన కలిశారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. అదే ఏడాది ఏప్రిల్ 22 న వారు వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, షెల్లీ బాట్లీవాలా, మాయా దారూవాలా. నేడు (జూన్ 27) మానెక్‌షా వర్ధంతి. 1914 ఏప్రిల్ 3న ఆయన జన్మించారు.
(చదవండి: స్వతంత్ర భారతి: మూడు రాష్ట్రాల అవతరణ)
Comments
Please login to add a commentAdd a comment