
ఢిల్లీలో జాతీయ జూనియర్ సంఘం చాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. అది 1983. విశ్వనాథ్ ఆనంద్‌ను నేను మొదటిసారిగా కలుసుకున్న సందర్భం కూడా అదే. టోపీ పెట్టుకున్న ఓ సన్నటి కుర్రాడు పోటీలు జరుగుతున్న ఆవరణలోకి వచ్చాడు. అతని ముఖంలో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అతని చదరంగం ఆటను మొట్టమొదటిసారిగా నేను అక్కడే చూశాను. అతను మెరుపు వేగంతో ఆడుతున్నాడు. నాకతని ఆట చూడగానే కలిగిన అభిప్రాయం అది.
అతను అతి చురుకుగా, నిర్దుష్టంగా, ఆట ఆడుతున్నాడు. అతనికి మేమంతా వెంటనే ‘చిచ్చర పిడుగు’ అని పేరు పెట్టేశాం. ఆ వేగం అతని హావభావాల్లో కూడా కనిపిస్తోంది. అతను ఒక చోట నిలకడగా కూర్చొని ఆడడు. ఆడుతున్నంత సేపూ అలా తిరుగుతూనే ఉంటాడు. 1992లో నేనతన్ని మరోసారి కలిశాను. అప్పుడు నేనే అతనితో ఆడాను. 1980లలో, 1986 వరకు అతను ఓడించలేని వ్యక్తేమీ కాదు. అతనితో నేడు ఆడటమే కాదు, కొన్ని ఆటల్లో గెలిచాను కూడా! 1992లో అతన్ని నేను చూసినప్పుడు మాత్రం అతను తన ఆటలో బాగా పురోగతి సాధించాడనిపించింది. అతను మారినట్లే అతని ఆట కూడా మరో స్థాయికి చేరుకుంది. చిచ్చర పిడుగు దశ నుంచి అతను మరింత నిబ్బరంగా ఆడే స్థాయికి చేరుకున్నాడు.
అసలు సిసలు గ్రాండ్ మాస్టర్‌గా మారిపోయాడు. ఆ మార్పు 1986 లోనే వచ్చిందనిపించింది. 1987 నాటికి అది స్థిరపడింది. అప్పుడు అతను ప్రపంచ జూనియర్ చాంపియన్ అయ్యాడు. అతనిలో అంతర్లీనంగా గ్రాండ్ మాస్టర్ కాగల లక్షణాలన్నీ ఉన్నాయి. ఆనంద్ అక్షరాలా బాల మేధావి. ఈ రంగంలో రష్యా ఆధిపత్యానికి ఆనంద్ చరమ గీతం పాడాడు. అంతకు ముందు ఆ పని బాబీఫిషర్ చేశాడు. గ్యారీ కాస్పరోవ్, అనాతొలి కార్పోవ్, లాదిమర్ క్రామ్నిక్‌ల ఆధిపత్యాన్ని నిలదీసిన వ్యక్తి ఆనంద్. ఆ రోజుల్లో చదరంగంలో భారత్‌కు అంతగా పేరు లేదు. అందువల్ల ఆనంద్ విజయం భారత ప్రతిష్టను ఆకాశానికెత్తేసింది. అతని విజయానికి అతని తల్లిదండ్రులు కూడా చాలా వరకు కారణం. విశ్వనాథ్‌కి వచ్చిన అవార్డులు దివ్యేందు బారువా, చదరంగంలో గ్రాండ్ మాస్టర్, అర్జున అవార్డు గ్రహీత తదితరాలు.
(చదవండి: రాజా రామ్ మోహన రాయ్ / 1772–1833)