
ఇండియా విషాదంలో మునిగిపోయిందంటూ నెహ్రూ మరణవార్తను అందించిన అంతర్జాతీయ పత్రిక
సరిహద్దు వివాదాలను చైనా బహిరంగ యుద్ధాలుగా మార్చిన సమయం అది. సామ్రాజ్యవాద బాధితులుగా మనం ఐకమత్యంగా ఉండాలని భావించి, ‘హిందీ–చీనీ భాయి భాయి అంటూ.. నెహ్రూ తరచు తన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుండేవారు. నెహ్రూ తన స్వభావం కొద్దీ ఒక సామ్యవాద దేశం మరొక సామ్యవాద దేశంపై దాడి చెయ్యదని నమ్మారు. అలాగే భారతదేశం అన్నది ఎవరూ చొరబడలేని మంచు గోడలైన హిమాలయాల వెనుక సురక్షితమని భావించారు. అయితే చైనా ఉద్దేశాలు, సైనిక సామర్ధ్యాల ముందు రెండూ కూడా తప్పని తేలాయి. భారత్‌పై చైనా యుద్ధానికి దిగిన కొద్ది రోజులలోనే చైనా సైన్యం ఈశాన్య భారతదేశంలోని అస్సాం వరకు చొచ్చుకు రావడం భారత సైన్యం బలహీనతను బహిర్గత పరచింది.
నెహ్రూ అంతిమయాత్ర
భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నెహ్రూ తీవ్ర విమర్శలు ఎదుర్కొని రక్షణ మంత్రి అయిన కృష్ణ మీనన్‌ను తొలగించి, యు.ఎస్. సైనిక సహాయాన్ని అర్థించవలసి వచ్చింది. ఆ తర్వాత క్రమంగా నెహ్రూ ఆరోగ్యం క్షీణించడం మొదలు పెట్టింది. అనారోగ్యం నుంచి కోలుకోవడానికి అయన 1963 లో కొన్ని నెలలు కశ్మీర్లో గడపవలసి వచ్చింది. కొంతమంది చరిత్ర కారులు ఈ ఆకస్మిక ఆరోగ్య సమస్యకు కారణం చైనా దండయాత్ర వలన ఆయన పొందిన అవమానం, చైనా విశ్వాస ఘాతుకంగా అని భావిస్తారు. కశ్మీర్ నుండి తిరిగి వచ్చిన తరువాత నెహ్రూ గుండెపోటుకు చికిత్స పొందుతూ 1964 మే 27 వేకువ జామున మరణించారు. హిందూమత కర్మల ననుసరించి యమునా నది ఒడ్డున ఉన్న శాంతివనంలో నెహ్రూ అంత్యక్రియలు నిర్వహించారు.