కేన్సర్ చికిత్సలో ఉపయోగించేందుకు మెథోట్రెక్సేట్‌ను అభివృద్ధి చేసినవారు ఎల్లాప్రగడ. మానవ శరీరంలోని కణాలకు శక్తినిచ్చేది ఎడినోసిన్ ట్రై ఫాస్ఫేట్ (ఏటీపీ) అని కనుగొన్నదీ ఆయనే. ఫైలేరియాకు హెట్రాజన్ కనుగొన్నది కూడా ఆయనే. యల్లాప్రగడ పర్యవేక్షణలో వెలువడిన (ఆరోమైసిన్ ) రోగ నిరోధకాలు పెన్సిలిన్ కంటే ఎంతో శక్తిమంతమైనవి. ఆయన కనిపెట్టిన ఫోలిక్ యాసిడ్, స్ప్రూ మందులు నేటికీ మానవాళికి ప్రాణాధారాలు! అందుకే ఎల్లాప్రగడ వైద్యశాస్త్రానికీ, జీవ రసాయనిక శాస్త్రానికీ చేసిన సేవలు చిరస్మరణీయంగా ఉండిపోయాయి.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం (నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ) లో ఎల్లాప్రగడ జన్మించారు. జగన్నాథం, వెంకమ్మ దంపతుల ఏడుగురు సంతానంలో నాలుగో సంతానం. యల్లాప్రగడ ప్రెసిడెన్సీ కాలేజీలో ఇంటర్ చదివాక, మద్రాస్ వైద్య కళాశాలలో చేరారు. రాజమండ్రిలో ఉండగా చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి సంస్కరణల ధోరణినీ, వందేమాతరం ఉద్యమం వేడినీ చూసిన ఎల్లాప్రగడ విదేశీ వస్త్ర బహిష్కరణ కోసం గాంధీ ఇచ్చిన పిలుపునకూ స్పందించారు. ఖద్దరుతో ఆపరేషన్ థియేటర్‌లో కనిపించారు. ఇదే జీవితం మీద తొలిదెబ్బ అవుతుందని ఆయన ఊహించలేదు. సర్జరీ ప్రొఫెసర్ ఎంసీ బ్రాడ్‌ఫీల్డ్‌కు అది తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
పరీక్ష బాగా రాసినా ఎల్లాప్రగడకు పూర్తి స్థాయిలో ఎంబీబీఎస్ పట్టా ఇవ్వనివ్వలేదు. ఎల్‌ఎంఎస్ సర్టిఫికెట్‌తో సరిపెట్టారు. మద్రాస్ మెడికల్ సర్వీస్‌లో చేరడానికి ఇది ఆటంకమైంది. అందుకే డాక్టర్ ఆచంట లక్ష్మీపతిగారి ఆయుర్వేద కళాశాలలో అనాటమీ అధ్యాపకునిగా చేరారు. ఆయుర్వేద ఔషధాలలోని రోగ నిరోధక లక్షణం ఆయనను ఎంతో ఆకర్షించింది. కొత్త పద్ధతులను మేళవించి పరిశోధన ప్రారంభించారు. ఇంతలోనే హార్వర్డ్ మెడికల్ కళాశాలలో ఉష్ణమండల రుగ్మతల విభాగం నుంచి పిలుపు వచ్చింది.
మల్లాడి సత్యలింగనాయకర్ చారిటీస్ (కాకినాడ) వారి సాయం కూడా అందింది. హార్వర్డ్‌లో డిప్లొమా పొంది అక్కడే అధ్యాపకుడయ్యారు. వైద్య పరిశోధనలో ఎల్లాప్రగడ ప్రతిభ ఎంతటిదో మొదట రుజువైనది ఇక్కడే. మనిషి రుగ్మతలు ఎన్నింటికో ఎల్లాప్రగడ మందు కనిపెట్టారు. కానీ ప్రపంచానికి పట్టిన రుగ్మతలకు మందు కనిపెట్టే వారి కోసం ప్రజలు ఎదురుచూస్తూనే ఉంటారు. వర్ణ వివక్ష, ఈర్ష్యా ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలతో బాధపడుతున్న ప్రపంచాన్ని మరమ్మతు చేయగల ఒక ఔషధం కోసం లోకం అర్రులు చాస్తోంది. ఎల్లాప్రగడ వంటి ప్రతిభా సూర్యుడిని మేఘాల్లా కమ్మేసినవీ ఇవే!
(చదవండి: శతమానం భారతి: పరిరక్షణ)
Comments
Please login to add a commentAdd a comment