న్యూఢిల్లీ/కోల్‌కతా/ సిలిగురి: పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం సంభవించిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆరేళ్ల బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో, మృతుల సంఖ్య 9 నుంచి 10కి చేరుకుందన్నారు. సీల్డాకు వెళ్తున్న గూడ్స్ రైలు సోమవారం ఉదయం రంగపాణి రైల్వే స్టేషన్‌లో నిలిచి ఉన్న కాంచనజంగ రైలును వెనుక నుంచి ఢీకొట్టిన విషయం తెల్సిందే.
ఘటనలో మృతి చెందిన, గాయాలపాలైన వారిని వదిలేసి ప్రమాదానికి గురవని బోగీలతో 850 మంది ప్రయా ణికులతో సోమవారం మధ్యాహ్నం బయలుదేరిన కాంచనజంగ ఎక్స్‌ప్రెస్ మంగళవారం వేకువజామున సీల్డాకు చేరుకున్నట్లు ఈస్టర్న్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. సీల్డా నుంచి ప్రయాణికులను వారిని గమ్య స్థానాలకు చేర్చేందుకు 16 బస్సులు, 60 కార్లను ఏర్పాటు చేశామన్నారు.
కుమార్తె బర్త్‌డే కోసం వస్తూ...
సోమవారం జరిగిన రైలు ప్రమాదం కోల్‌కతాకు చెందిన సృష్టి అనే 11 ఏళ్ల చిన్నారికి తీరని వేదన మిగిల్చింది. ఈమె తండ్రి శుభొజిత్ మాలి(31) ఆఫీసు పని మీద శుక్రవారం సిలిగురి వెళ్లారు. మరికొద్ది రోజులపాటు ఆయన అక్కడే ఉండిపోవాల్సి ఉంది. కానీ, సృష్టి బర్త్‌డే వేడుకలో పాల్గొనేందుకు ముందుగానే సోమవారం బయలుదేరారు. కాంచనజంగ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కే ముందు సృష్టికి వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఎలాగోలా సమయానికి వచ్చేస్తా.
బర్త్‌డే ఘనంగా చేసుకుందామని, కేకు తీసుకొస్తానని కూతురికి మాట ఇచ్చారు. కానీ, విధి మరోలా ఉంది. రైలు ప్రమాదంలో మరణించిన వారిలో శుభొజిత్ కూడా ఉన్నారు. అదే రైలులో ప్రయాణించిన ఆయన స్నేహితుడు ఈ విషాద వార్తను కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో, శుభొజిత్ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగింది. ఎప్పుడూ బస్సులోనే ప్రయాణించే శుభొజిత్.. ఈసారి మాత్రం కుమార్తె పుట్టిన రోజు వేడుక జరపాలనే తొందరలో రైలు ప్రయాణాన్ని ఎంచుకున్నారని, ఇదే ఆయన ప్రాణాలు తీసిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలి: ఖర్గే
దేశంలో రైల్వే వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం నాశనం చేసిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని మండిపడ్డారు. మోటారు సైకిల్‌పై కూర్చుని ప్రమాద స్థలికి మంత్రి చేరుకోవడంపై స్పందిస్తూ. అశ్వినీ వైష్ణవ్ రైల్వే మంత్రినా లేక రీల్ మంత్రినా అంటూ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment