
కర్ణాటక పౌర సరఫరా మంత్రి ఉమేశ్ కత్తి
సాక్షి, బెంగళూరు : ఒకవైపు కోవిడ్ మహమ్మారి, మరోవైపు లాక్‌డౌన్, ఇటువంటి సమయంలో రేషన్ బియ్యాన్ని తగ్గిస్తే మేమెలా బతకాలి, ఆకలితో చావాలా? అని ప్రశ్నించిన వ్యక్తికి కర్ణాటక పౌర సరఫరా మంత్రి ఉమేశ్ కత్తి వివాదాస్పద సమాధానమిచ్చారు. ఆకలితో చస్తే.. చావు అని మంత్రి చెప్పడంతో అందరూ కంగుతిన్నారు. గదగ జిల్లా కుర్తకోటి గ్రామ రైతు సంఘం కార్యకర్త ఈశ్వర్.. మంత్రికి ఫోన్ చేసి రేషన్ బియ్యం తగ్గించడాన్ని ప్రశ్నించారు.
మంత్రి మాట్లాడుతూ ఉత్తర కర్ణాటకలో బియ్యంతో పాటు జొన్నలు ఇస్తున్నాం, వచ్చే నెల నుంచి బియ్యం పెంచుతాం అన్నారు. బియ్యం పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయి, లాక్‌డౌన్ ఉంది, అప్పటి వరకు ఉపవాసంతో చచ్చేదా? అంటూ ఈశ్వర్ ప్రశ్నించారు. అందుకు కర్ణాటక పౌర సరఫరా మంత్రి ఉమేశ్ కత్తి చావడమే మంచిదని వ్యాఖ్యానిస్తూ తనకు తిరిగి ఫోన్ చేయవద్దంటూ హెచ్చరించారు.
ఈ ఆడియో బుధవారం వైరల్ కావడంతో మంత్రి వివరణ ఇచ్చారు. ఫోన్ చేసిన వ్యక్తి మరణించాలా అని అడిగితే సరే అని చెప్పాను. వద్దు అని చెప్పేటంత పెద్ద మనస్సు నాకు లేదు అన్నారు. మంత్రి మాటలపై పలు వర్గాల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో చివరకు క్షమాణ కోరారు. ఎవరూ మరణించాలని తాను కోరుకోబోనని, అందరికీ మంచి జరగాలనే కోరుకుంటానని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి.
చదవండి: (ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం.. 150 జిల్లాల్లో లాక్‌డౌన్?)