
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్ కలాన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. మాన్ ప్రమాణ స్వీకారానికి ప్రజలు భారీగా తరలి రావడంతో భగత్ సింగ్ పూర్వీకుల గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. కాగా 1970 తర్వాత సీఎం పగ్గాలు చేపడుతున్న చిన్న వయస్కుడు భగవంత్ మాన్ (48) కావడం విశేషం.
చదవండి: ఎంపీ పదవికి భగవంత్ మాన్ రాజీనామా
ఇక పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను, శిరోమణి అకాలీదల్‌ను వెనక్కి నెట్టి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 117 స్థానాల్లో 92 సీట్లు గెలిచి ఏ పార్టీలోపొత్తు అవసరం లేకుండానే అతిపెద్ద పార్టీగా అతరించింది. సంగ్రూర్ జిల్లాలోని ధౌరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన భగవంత్ మాన్ 60వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే ఈసారి రాజ్ భవన్ నుంచి కాకుండా స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ స్వగ్రామం ఖతర్ కలన్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో ఆ గ్రామంలో కోలాహలం నెలకొంది.
చదవండి: పంజాబ్ రాజకీయాల్లో కొత్త చరిత్ర.. ఫలించిన కేజ్రివాల్ ఎనిమిదేళ్ల కష్టం