
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ భార్య.. డాక్టర్ ''గురుప్రీత్ కౌర్'' గురువారం మొహాలీలోని ప్రైవేట్ ఆసుపత్రిలో పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని భగవంత్ స్వయంగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు.
దేవుడు ఒక కుమార్తెను బహుమతిగా ఇచ్చాడు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు అంటూ.. బిడ్డ ఫోటో కూడా షేర్ చేశారు. లూథియానాలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో గురుప్రీత్‌కు ప్రసవం జరిగినట్లు తెలిసింది. ఈ వార్త తెలుసుకున్న నెటిజన్లు, అభిమానులు భగవంత్ మాన్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
పంజాబ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో పదవిలో ఉన్నప్పుడు తండ్రి అయిన మొదటి వ్యక్తి భగవంత్ సింగ్ మాన్. ఈయన 2022 జులైలో గురుప్రీత్‌ను రెండో వివాహం చేసుకున్నారు. అంతకు ముందు ఇంద్రప్రీత్ కౌర్ అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల 2015లో విడిపోయారు.
భగవంత్ సింగ్ మాన్, ఇంద్రప్రీత్ కౌర్ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ఇప్పుడు రెండో భార్య పాపకు జన్మనివ్వడంతో మూడోసారి తండ్రయ్యారు. జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకల్లో భగవంత్ మాన్ తన భార్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ప్రకటించారు. ఇప్పుడు తన కుమార్తె ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Blessed with baby Girl.. pic.twitter.com/adzmlIxEbb
— Bhagwant Mann (@BhagwantMann) March 28, 2024