
మలప్పురం/గుడలూర్: ‘‘బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను గద్దెదించేందుకు కేంద్రం గవర్నర్లను వాడుకుంటోంది. గవర్నర్లను ప్రజలెన్నుకున్నారా? వారి పెత్తనమేమిటి?’’అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆయన భారత్ జోడో యాత్ర గురువారం మళ్లీ తమిళనాడులోని నీలగిరి జిల్లా అడుగుపెట్టింది. బీజేపీ ఒకే జాతి, ఒకటే భాష ఎజెండాను అమలు చేస్తోందని ఆరోపించారు.
భాషలు, సంస్కృతులు, మతాలను గౌరవించుకోవాలన్నారు. మోకాలి నొప్పి కొద్దిగా ఇబ్బంది పెడుతోందని రాహుల్ చెప్పారు. అయినా ప్రజలతో మాట్లాడుతూ ముందుకు సాగుతుంటే ఆ బాధ తెలియడం లేదని అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ వీడియోను విడుదల చేసింది. శుక్రవారం ఆయన యాత్ర చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట్ వద్ద కర్ణాటకలో అడుగుపెట్టనుంది.